స్ట్రైడ్స్‌- ఎడిల్‌వీజ్.. నేలచూపు

స్ట్రైడ్స్‌- ఎడిల్‌వీజ్.. నేలచూపు

పుదుచ్చేరి ప్లాంటులో ప్రస్తుత ప్రమాణాలకు అనుగుణమైన తయారీ(సీజీఎంపీ) నిబంధనలు పాటించడంలేదంటూ అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) పేర్కొన్నట్లు వెలువడిన వార్తలు స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ కౌంటర్లో అమ్మకాలకు తెరతీశాయి. కాగా.. మరోపక్క వెల్త్‌ బిజినెస్‌లో వాటాను విక్రయించనున్నట్లు మీడియా పేర్కొన్న నేపథ్యంలో ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కౌంటర్లోనూ అమ్మకాలు తలెత్తాయి. దీంతో లాభాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో డీలాపడ్దాయి. వివరాలు చూద్దాం..

స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌
పుదుచ్చేరిలోని ప్లాంటులో సీజీఎంపీ నిబంధనలను భారీగా ఉల్లంఘిస్తున్నట్లు తనిఖీలలో స్పష్టమైందని లేఖ ద్వారా స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ తెలియజేసింది. సీజీఎంపీకి సంబంధించిన డాక్యుమెంట్లను సైతం తొలగించినట్లు లేఖలో పేర్కొంది. స్ట్రైడ్స్‌ ఫార్మా పుదుచ్చేరి ప్లాంటులో యూఎస్‌ఎఫ్‌డీఏ ఈ ఏడాది జనవరి 28- ఫిబ్రవరి 5 మధ్య తనిఖీలు నిర్వహించింది. ఫలితంగా జులై 2న యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి స్ట్రైడ్స్‌కు హెచ్చరికల లేఖ జారీ అయ్యింది. అయితే లేఖలోని అంశాలు తాజాగా బయటపడటంతో స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు తొలుత 8 శాతం పతనమైంది. రూ. 347 వరకూ దిగజారింది. ప్రస్తుతం కాస్త కోలుకుని 2.5 శాతం నష్టంతో రూ. 368 వద్ద ట్రేడవుతోంది. 

Image result for edelweiss financial services

ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ 
యూఎస్‌ కంపెనీ కోరా మేనేజ్‌మెంట్‌కు అనుబంధ సంస్థ ఎడిల్‌వీజ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌లో 20 శాతం వాటాను విక్రయించేందుకు ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ నిర్వహిస్తున్న చర్చలు తుది దశకు చేరినట్లు వార్తలు వెలువడ్డాయి. తద్వారా రూ. 2,000 కోట్లవరకూ సమీకరించనున్నట్లు మీడియా పేర్కొంది. ఈ నిధులను రుణ చెల్లింపులకు వినియోగించే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ షేరు ప్రస్తుతం 3.5 శాతం నష్టంతో రూ. 168 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 166 దిగువకు చేరింది.