టాటా ఎలక్సీ- యస్‌ బ్యాంక్‌ బోర్లా

టాటా ఎలక్సీ- యస్‌ బ్యాంక్‌ బోర్లా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశ పరచడంతో ఇంజినీరింగ్‌ సంబంధ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ టాటా ఎలక్సీ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోవైపు ఈ ఏడాది తొలి క్వార్టర్‌(ఏప్రిల్‌-జూన్‌) ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ అనూహ్య రీతిలో హెచ్చుతగ్గులను చవిచూస్తోంది. ఈ కౌంటర్లో బ్లాక్‌డీల్‌ జరిగినట్లు వెల్లడయ్యాక అమ్మకాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర వివరాలు చూద్దాం..

టాటా ఎలక్సీ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఇంజినీరింగ్‌ సంబంధ ఐటీ సేవల టాటా గ్రూప్‌ సంస్థ టాటా ఎలక్సీ రూ. 49 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2018-19) క్యూ1తో పోలిస్తే ఇది 31 శాతం తక్కువకాగా.. మొత్తం ఆదాయం సైతం 5 శాతంపైగా క్షీణించి రూ. 362 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ లాభం(EBIT) మరింత అధికంగా 42 శాతం నీరసించి రూ. 58 కోట్లకు పరిమితమైంది. EBIT మార్జిన్లు 26.3 శాతం నుంచి 16.1 శాతానికి తిరోగమించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో టాటా ఎలక్సీ షేరు 5.5 శాతం పతనమైంది. రూ. 770 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 768 సమీపంలో 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది.

Image result for yes bank ltd

యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాడుతోంది. గత ముగింపు రూ. 104కాగా.. ఎన్‌ఎస్‌ఈలో ఇంట్రాడేలో రూ. 108.5 వద్ద గరిష్టాన్నీ, రూ. 99 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ప్రస్తుతం 3.3 శాతం నష్టంతో రూ. 100.5 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ కౌంటర్లో తాజాగా బ్లాక్‌డీల్‌ జరిగినట్లు ఎక్స్ఛేంజీల డేటా పేర్కొంది. తద్వారా 11.5 లక్షల షేర్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. కొనుగోలుదారులు, అమ్మకందారుల వివరాలు ప్రస్తుతానికి వెల్లడికాలేదు.