మార్చ్ 2020 నాటికి నిఫ్టీ 12,900 పాయింట్లకు! నోమురా అంచనా!!

మార్చ్ 2020 నాటికి నిఫ్టీ 12,900 పాయింట్లకు! నోమురా అంచనా!!

గత నెల రోజుల్లో నిఫ్టీ దాదాపు 2 శాతం నష్టపోయింది. బడ్జెట్ తరువాత కూడా మార్కెట్లు స్థిరంగా రాణించలేదనే అంటున్నారు ఎనలిస్టులు. కానీ.. రాబోయే కాలంలో ఫ్యూచర్ ఎర్నింగ్స్ పెరగొచ్చని, బ్యాంకింగ్, రియాల్టీ , ఇంధన రంగాల్లో మంచి వృద్ధికి అవకాశం ఉందని బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి. ఈ ప్రాతిపదికన  మార్చి 2020 నాటికి నిఫ్టీ 12,900 పాయింట్లకు చేరొచ్చని జపాన్‌ బ్రోకరేజీ సంస్థ నొమురా అంచనా వేసింది. పెట్టుబడులు పుంజుకోవడం, తక్కువ బాండు రాబడులు ఇందుకు సపోర్ట్‌గా నిలిచే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ‘2020-21 ఆదాయ అంచనాల ప్రకారం మార్కెట్‌ విలువ 17 రెట్లుగా పరిగణిస్తే...  నిఫ్టీ 12,900 పాయింట్లకు చేరొచ్చు. ప్రస్తుత లెవల్స్‌తో పోలిస్తే 9 శాతం వృద్ధి నమోదు కావొచ్చని నొమురా సంస్థ పేర్కొంది.  ఏడాది కాలంలో ఎర్నింగ్స్ స్పెక్యులేషన్  ప్రకారం మార్కెట్‌ 17- 18 రెట్లు ఎక్కువగా ట్రేడవ్వొచ్చని నోమురా ఇండియా పేర్కొంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs)కు నగదు లభ్యత పెంచడానికి ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్‌ చేపట్టిన చర్యల వల్ల రుణ సంక్షోభ భయాలు తగ్గుతాయని బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం వర్షాలు లేక పోవడం, బ్యాంకుల రుణ సామర్థ్యం తగ్గడం మార్కెట్‌ ముప్పుగా పరిణమించాయి. అధిక వ్యయాలు, నిర్వాహణా భారాలతో వాహన, వినియోగ రంగంలోని స్టాక్స్ కొంత వెనకబాటుకు గురవుతాయని నోమురా అంచనా వేస్తోంది.  సెక్టార్ల వారీగా బ్యాంకులు , మౌలిక వసతులు, ఆరోగ్యం, బీమా రంగాలు రానున్న రోజుల్లో మంచి లాభదాయకత చూపించవచ్చని నోమురా అంచనా వేస్తుంది. ఎకానమీ షేర్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు పుంజుకునే ఛాన్స్ ఉందని నోమురా అభిప్రాయపడుతోంది. ఫార్మా సెక్టార్ లోని స్టాక్స్ కూడా ఆకర్షణీయంగా మారొచ్చని నోమురా విశ్లేషిస్తుంది. ఇక దేశ వ్యాప్తంగా రియాల్టీ రంగం వేగంగా దూసుకెళ్తుండటంతో రియాల్టీ సెక్టార్, మౌలిక నిర్మాణ రంగంలోని స్టాక్స్ కూడా అప్ ట్రెండ్‌లో కనబడొచ్చని బ్రోకింగ్ సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ అంచనాల నేపథ్యంలో రానున్న 2020 మార్చ్ నాటికి నిఫ్టీ 12,900 పాయింట్లకు పైగా ట్రేడ్ కావొచ్చని నోమురా అంచనాలు వేస్తోంది.