డీసీబీ బ్యాంక్‌- క్యూ1 షాక్‌  

డీసీబీ బ్యాంక్‌- క్యూ1 షాక్‌  

ప్రయివేట్‌ రంగ సంస్థ డీసీబీ బ్యాంక్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. రుణ మంజూరీ మందగించడం, స్లిప్పేజెస్‌ పెరగడం, మార్జిన్లపై ఒత్తిడి తదితర ప్రతికూల అంశాలు బ్యాంక్‌ పనితీరును దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితాలు నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో మూకుమ్మడిగా అమ్మకాలకు దిగారు. ఫలితంగా డీసీబీ బ్యాంక్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 11 శాతం కుప్పకూలి రూ. 212 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 14 శాతం వరకూ దిగజారింది. రూ. 205 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. బ్యాంకులో ప్రస్తుతం ప్రమోటర్ల వాటా 14.91% కాగా.. సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 51.89%గా నమోదైంది. ఇతర నాన్‌ఇన్‌స్టిట్యూషన్స్‌కు 33.20% వాటా ఉంది. ఫలితాలు చూద్దాం..

17 శాతం వృద్ధి
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో డీసీబీ బ్యాంక్‌ నికర లాభం దాదాపు 17 శాతం పుంజుకుని రూ. 81 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతంపైగా ఎగసి రూ. 944 కోట్లను తాకింది. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.86 శాతం నుంచి 1.96 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.72 శాతం నుంచి 0.81 శాతానికి పెరిగాయి. ఈ కాలంలో రుణాలలో వృద్ధి 13 శాతానికి పరిమితమైంది. గత ఐదేళ్లలో ఇది కనిష్టంకాగా.. నికర వడ్డీ మార్జిన్లు 0.23 బేసిస్‌ పాయింట్లు క్షీణించి 3.67 శాతాన్ని తాకాయి. అగ్రి, వాణిజ్య వాహన పోర్ట్‌ఫోలియోల కారణంగా తాజా స్లిప్పేజెస్‌ 2.5 శాతం పెరిగినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ఈ కేలండర్‌ ఏడాది(2019)లో డీసీబీ బ్యాంక్‌ షేరు 42 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఈ బాటలో జూన్‌ 25న రూ. 245 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది కూడా! షేరు ధర అధిక స్థాయిలో ఉండటంతోపాటు.. ఫలితాలు నిరాశపరచడంతో డీసీబీ బ్యాంక్‌ షేరుకి సెల్‌ రేటింగ్‌ను ఇస్తున్నట్లు  బ్రొకింగ్‌ సంస్థ ఎమ్‌కే ప్రకటించింది. రూ. 170 టార్గెట్‌ ధరను సైతం ఇచ్చింది.