అక్కడక్కడే.. మీడియా ప్లస్‌లో

అక్కడక్కడే.. మీడియా ప్లస్‌లో

యథాప్రకారం దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. ఆపై అటూఇటుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌  స్వల్పంగా 12 పాయింట్లు బలపడి 39,143కు చేరింది. ఇక నిఫ్టీ సైతం నామమాత్రంగా 2 పాయింట్లు పుంజుకుని 11,665 వద్ద ట్రేడవుతోంది. వరుసగా రెండో రోజు మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు చెప్పుకోదగ్గ లాభాలతో నిలవగా.. అమెరికా స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. చైనాతో వాణిజ్య వివాద పరిష్కారాలు సుదూరంలో ఉన్నట్లు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజాగా వ్యాఖ్యానించడంతో నాలుగు రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. కాగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో బలహీన ధోరణి నెలకొంది.

అటూఇటుగా
ఎన్‌ఎస్‌ఈలో మీడియా 1 శాతం పుంజుకుంది. మిగిలిన రంగాలన్నీ స్వల్ప స్థాయిలో అటూఇటుగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్‌, కొటక్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐవోసీ, బజాజ్ ఫైనాన్స్, విప్రో, బ్రిటానియా 2.5-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. మరోపక్క గెయిల్‌, టాటా మోటార్స్‌, హీరో మోటో, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, మారుతీ, సన్‌ ఫార్మా, హిందాల్కో 1.7-0.5 శాతం మధ్య క్షీణించాయి. మీడియా కౌంటర్లలో హాథవే, పీవీఆర్‌, జీ మీడియా, జీ, సన్‌ టీవీ, డిష్‌ టీవీ, డెన్‌ 2.5-0.6 మధ్య బలపడ్డాయి.

స్ట్రైడ్స్‌ పతనం
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో ఎంసీఎక్స్‌, అపోలో హాస్పిటల్స్‌, చోళమండలం, మారికో, బెర్జర్ పెయింట్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, కంకార్‌ 4-1.5 శాతం మధ్య పుంజుకున్నాయి. కాగా.. మరోవైపు స్ట్రైడ్స్‌ ఫార్మా 7 శాతం పతనంకాగా.. ఫెడరల్‌ బ్యాంక్‌, టాటా ఎలక్సీ, ఆర్‌ఈసీ, కమిన్స్‌, టొరంట్‌ ఫార్మా, పీఎన్‌బీ, టాటా మోటార్స్‌ డీవీఆర్‌ 2.5-1.2 శాతం మధ్య క్షీణించాయి. 

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో కదులుతున్న నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లకు కొంతమేర డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.3-0.1 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ 750 షేర్లు లాభపడగా.. 553 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో మెడికా, లింకన్‌, స్వెలెక్ట్‌, జెట్‌ ఎయిర్‌, ఇగార్షీ, బీఎఫ్‌, జీటీపీఎల్‌, నారాయణ తదితరాలు 5-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి.