4 రోజుల ర్యాలీపై ట్రంప్‌ నీళ్లు

4 రోజుల ర్యాలీపై ట్రంప్‌ నీళ్లు

చైనాతో వాణిజ్య వివాద పరిష్కారాలు బహు దూరంలో ఉన్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్‌ చేసిన తాజా వ్యాఖ్యలు అమెరికా స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్‌ వేశాయి. మరోవైపు బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీగ్రూప్‌ బాటలో జేపీ మోర్గాన్‌, వెల్స్‌ఫార్గో పటిష్ట ఫలితాలు సాధించినప్పటికీ రానున్న కాలంలో నికర వడ్డీ ఆదాయం తగ్గనున్న అంచనాలు సెంటిమెంటును బలహీనపరచాయి. ఫలితంగా మంగళవారం మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య చివరికి స్వల్ప నష్టాలతో నిలిచాయి. డోజోన్స్‌ 24 పాయింట్లు(0.1 శాతం) నీరసించి 27,336 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 10 పాయింట్లు(0.35 శాతం) క్షీణించి 3,004 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ సైతం 35 పాయింట్లు(0.45 శాతం) వెనకడుగుతో 8,223 వద్ద ముగిసింది. కాగా.. వరుసగా నాలుగో రోజు సోమవారం ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను అందుకున్న విషయం విదితమే.

Image result for us banking

బ్యాంక్స్‌ వీక్‌
సోమవారం ఆకర్షణీయ ఫలితాలు సాధించన సిటీగ్రూప్‌ మార్జిన్లు బలహీనపడగా.. ఇదే బాటలో జేపీ మోర్గాన్‌ చేజ్‌, వెల్స్‌ ఫార్గో అండ్‌ కో అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించాయి. అయితే డిపాజిట్‌ వ్యయాలు పెరుగుతుండటంతో నికర వడ్డీ ఆదాయం మందగించవచ్చన్న అంచనాలు ఈ కౌంటర్లను దెబ్బతీశాయి. వెల్స్‌ ఫార్గో 3 శాతం, జేపీ మోర్గాన్‌ 1.2 శాతం చొప్పున క్షీణించాయి. ఫలితాల నేపథ్యంలో మరో బ్యాంకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ గ్రూప్‌ షేరు మాత్రం 2 శాతం ఎగసింది. జనరిక్‌ కంపెనీల పోటీ కారణంగా మూడో క్వార్టర్‌ ఫలితాలు నీరసించవచ్చన్న అంచనాల నడుమ హెల్త్‌కేర్‌ కౌంటర్‌ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ షేరు దాదాపు 2 శాతం నష్టపోయింది. ఇతర కౌంటర్లలో ట్రక్కింగ్‌ కంపెనీ జేబీ హంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ పటిష్ట ఫలితాలు సాధించడంతో 5.6 శాతం జంప్‌చేసింది.

ఆసియా డౌన్‌
మంగళవారం యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. జర్మనీ 0.35 శాతం, ఫ్రాన్స్‌, యూకే 0.65 శాతం చొప్పున పుంజుకున్నాయి. కాగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో బలహీన ట్రెండ్‌ నెలకొంది. కొరియా, తైవాన్‌, హాంకాంగ్‌ 0.8-0.4 శాతం మధ్య క్షీణించగా.. సింగపూర్‌, జపాన్‌, ఇండొనేసియా, చైనా, థాయ్‌లాండ్‌ 0.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 97.38కు పుంజుకోగా.. యూరో 1.121కు బలహీనపడింది. జపనీస్‌ యెన్‌ 108.27 వద్ద ట్రేడవుతోంది.