నేలచూపుతో ప్రారంభంకావచ్చు!

నేలచూపుతో ప్రారంభంకావచ్చు!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 19 పాయింట్లు క్షీణించి 11,628 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. అమెరికా స్టాక్‌ మార్కెట్ల నాలుగు రోజుల రికార్డుల ర్యాలీకి మంగళవారం బ్రేక్‌పడింది. బ్యాంకింగ్‌ దిగ్గజాల ఫలితాలు ఆకట్టుకున్నప్పటికీ భవిష్యత్‌ ఆర్జనపై సందేహాలు, చైనాతో వాణిజ్య వివాదాలపై ట్రంప్‌ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో స్వల్ప నష్టాలతో ముగిశాయి. కాగా.. మంగళవారం వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.  దీంతో నేడు కొంతమేర ఒడిదొడుకుల మధ్య కదిలే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. 

రెండో రోజూ జోరు
స్వల్ప ఒడిదొడుకులతో ప్రారంభమైనప్పటికీ తదుపరి జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరివరకూ సానుకూలంగానే కదిలాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే అధిక భాగం మొగ్గు చూపడంతో తొలి సెషన్‌లో లాభాల సెంచరీ చేసిన సెన్సెక్స్‌ మిడ్‌సెషన్‌కల్లా డబుల్‌నూ అందుకుంది. చివరికి 234 పాయింట్లు ఎగసి 39,131 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం మంగళవారం 74 పాయింట్లు బలపడి 11,663 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,174- 38,845 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూడగా.. నిఫ్టీ సైతం 11670- 11574 పాయింట్ల మధ్య ఒడిదొడుకులు ఎదుర్కొంది.  

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,601 పాయింట్ల వద్ద, తదుపరి 11,539 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,697 పాయింట్ల వద్ద, తదుపరి 11,731 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 30,455, 30,340 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 30,660, 30,750 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దేశీ ఫండ్స్‌ దన్ను
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 445 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 638 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. ఎఫ్‌పీఐలు సోమవారం రూ. 216 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు దాదాపు రూ. 592 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.