రెండో రోజూ జోరు- డబుల్‌' ముగింపు

రెండో రోజూ జోరు- డబుల్‌' ముగింపు

స్వల్ప ఒడిదొడుకులతో ప్రారంభమైనప్పటికీ తదుపరి జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరివరకూ సానుకూలంగానే కదిలాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే అధిక భాగం మొగ్గు చూపడంతో తొలి సెషన్‌లో లాభాల సెంచరీ చేసిన సెన్సెక్స్‌ మిడ్‌సెషన్‌కల్లా డబుల్‌నూ అందుకుంది. చివరికి 234 పాయింట్లు ఎగసి 39,131 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 74 పాయింట్లు బలపడి 11,663 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,174- 38,845 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూడగా.. నిఫ్టీ సైతం 11670- 11574 పాయింట్ల మధ్య ఒడిదొడుకులు ఎదుర్కొంది. కాగా.. సోమవారం వరుసగా నాలుగో రోజు అమెరికా స్టాక్‌ ఇండెక్సులు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. 

రియల్టీ, ఫార్మా ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ 2-1 శాతం మధ్య ఎగశాయి. ఐటీ 0.6 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 14 శాతం దూసుకెళ్లగా.. టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫిన్‌, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్‌, టైటన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, పవర్‌గ్రిడ్‌ 6-2 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, కొటక్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, బ్రిటానియా, హిందాల్కో 1.7-0.6 శాతం మధ్య క్షీణించాయి. రియల్టీ కౌంటర్లలో ఫీనిక్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ప్రెస్టేజ్‌, బ్రిగేడ్‌, డీఎల్‌ఎఫ్‌, సన్‌టెక్, ఇండియాబుల్స్‌ 3.2-1 శాతం మధ్య ఎగశాయి.  

మణప్పురం జోరు
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో మణప్పురం, జూబిలెంట్‌ ఫుడ్‌, బిర్లా సాఫ్ట్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, ఇండిగో, దివాన్‌ హౌసింగ్‌, టొరంట్‌ ఫార్మా, యూనియన్‌ బ్యాంక్‌ 6-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ కేపిటల్‌, జస్ట్‌ డయల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, పిరమల్‌, సీఈఎస్‌సీ, టీవీఎస్‌ మోటార్, మదర్‌సన్‌ 4.4-1.4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. 

మిడ్‌ క్యాప్స్‌ ఓకే
మార్కెట్లు లాభాలతో ముగిసిన నేపథ్యంలో చిన్న, మధ్యతరహా షేర్లకు డిమాండ్‌ పెరిగింది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.7-0.3 శాతం చొప్పున బలపడ్డాయి. 1162 షేర్లు లాభపడగా.. 1299 నష్టాలతో ముగిశాయి. 

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 216 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 592 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.