ఇండిగో- గ్రీవ్స్‌ కాటన్‌.. జోరు

ఇండిగో- గ్రీవ్స్‌ కాటన్‌.. జోరు

మూడు అంతర్జాతీయ మార్గాలలో ఆరు నాన్‌స్టాప్‌ సర్వీసులను ప్రారంభించినట్లు తెలియజేయడంతో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోవైపు అనుబంధ సంస్థ యాంపియర్‌ వెహికల్స్‌లో వాటాను పెంచుకున్నట్లు వెల్లడించడంతో ఇంజిన్ల తయారీ సంస్థ గ్రీవ్స్‌ కాటన్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.

ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌
ఇండిగో బ్రాండు విమానయాన సర్వీసుల సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ తాజాగా మూడు అంతర్జాతీయ ప్రాంతాలకు నాన్‌స్టాప్‌ సర్వీసులను ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ నెల 25 నుంచి ఆరు సర్వీసులను రోజువారీ నిర్వహించనున్నట్లు తెలియజేసింది. తద్వారా ముంబై నుంచి కువైట్‌, ఢిల్లీ నుంచి జెడ్డా, ముంబై నుంచి దుబాయ్‌కు నాన్‌స్టాప్‌ సర్వీసులను అందించనున్నట్లు తెలియజేసింది. వీటిలో ఒక సర్వీసు ఆగస్ట్‌ 5 నుంచీ ప్రారంభంకానున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఇంటర్‌గ్లోబ్‌ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 1432 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1434 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రస్తుతం ప్రమోటర్లకు 74.93% వాటా ఉంది. 

Image result for greaves cotton ltd
    
గ్రీవ్స్‌ కాటన్‌ లిమిటెడ్‌
అనుబంధ సంస్థ యాంపియర్‌ వెహికల్స్‌లో ప్రైమరీ, సెకండరీ కొనుగోళ్ల ద్వారా దాదాపు 26 లక్షల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నట్లు గ్రీవ్స్‌ కాటన్‌ లిమిటెడ్‌ పేర్కొంది. ఇందుకు రూ. 38.5 కోట్లను వెచ్చించినట్లు తెలియజేసింది. దీంతో యాంపియర్‌లో వాటా 67.34 శాతం నుంచి 81.23 శాతానికి పెరిగినట్లు పేర్కొంది. యాంపియర్‌లో తొలుత 2018 అక్టోబర్‌లో 67.34 శాతం వాటాను రూ. 77 కోట్లకు గ్రీవ్స్‌ కొనుగోలు చేసింది. కాగా.. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో గ్రీవ్స్‌ కాటన్‌ షేరు 2.3 శాతం లాభపడి రూ. 131 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 133 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రస్తుతం ప్రమోటర్లకు 51.90% వాటా ఉంది.