రియల్టీ జోరు.. ఐటీ వెనకడుగు

రియల్టీ జోరు.. ఐటీ వెనకడుగు

స్వల్ప ఒడిదొడుకులతో ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు స్థిరంగా కదులుతున్నాయి. తొలి సెషన్‌లో లాభాల సెంచరీ చేసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 140 పాయింట్లు ఎగసి 39,036కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 45 పాయింట్లు బలపడి 11,633 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,062- 38,845 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూడగా.. నిఫ్టీ సైతం 11619- 11574 పాయింట్ల మధ్య ఒడిదొడుకులు ఎదుర్కొంది. కాగా.. సోమవారం వరుసగా నాలుగో రోజు అమెరికా స్టాక్‌ ఇండెక్సులు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. అయితే ఆసియాలో మిశ్రమ ట్రెండ్‌ నెలకొంది. కాగా.. గత కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో కదులుతున్న దేశీ మార్కెట్లు సోమవారం సైతం ఆటుపోట్లను చవిచూసిన విషయం విదితమే.

మెటల్‌, ఫార్మా ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ 2.4 శాతం జంప్‌చేయగా. మెటల్‌, ఫార్మా, బ్యాంక్స్‌ 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఐటీ 0.7 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, టైటన్‌, హెచ్‌యూఎల్‌, యస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌, ఓఎన్‌జీసీ, ఐవోసీ 4.4-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే టీసీఎస్‌, యూపీఎల్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, కొటక్‌ బ్యాంక్‌, హిందాల్కో 1.4-0.5 శాతం మధ్య క్షీణించాయి. రియల్టీ కౌంటర్లలో ప్రెస్టేజ్‌, డీఎల్‌ఎఫ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఒబెరాయ్‌, ఫీనిక్స్‌, శోభా 4-2 శాతం మధ్య ఎగశాయి.  

బిర్లా సాఫ్ట్‌ జోరు
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో బిర్లా సాఫ్ట్‌ 7 శాతం జంప్‌చేయగా, జూబిలెంట్‌ ఫుడ్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, మణప్పురం, టొరంట్‌ ఫార్మా, ఎస్‌ఆర్ఎఫ్‌, క్యాస్ట్రాల్‌, ఇండిగో 4.5-3.2 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, కమిన్స్‌, జస్ట్‌ డయల్‌, పిరమల్‌, అమరరాజా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, టీవీఎస్‌ మోటార్ 4.3-1.4 శాతం మధ్య నష్టపోయాయి. 

మిడ్‌ క్యాప్స్‌ ఓకే
మార్కెట్లు లాభాలతో కదులుతున్న నేపథ్యంలో ప్రధానంగా మధ్యతరహా షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ 0.3 శాతం బలపడింది. ఇప్పటివరకూ 1005 షేర్లు లాభపడగా.. 1160 నష్టాలతో కదులుతున్నాయి. మిడ్‌ క్యాప్స్‌లో అజంతా, గ్లెన్‌మార్క్‌, టాటా గ్లోబల్‌, బెర్జర్‌, జీఎస్‌కే కన్జూమర్స్‌, హావెల్స్‌, ఇమామీ తదితరాలు 4-1.5 శాతం మధ్య లాభపడ్డాయి.