ఆటో స్టాంపింగ్స్‌- కమిన్స్‌ నేలచూపు

ఆటో స్టాంపింగ్స్‌- కమిన్స్‌ నేలచూపు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరును ప్రదర్శించడంతో ఆటో విడిభాగాల సంస్థ ఆటోమోటివ్‌ స్టాంపింగ్స్‌ అండ్‌ అసెంబ్లీస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క కంపెనీ ఎండీ రాజీనామా చేసినట్లు వెల్లడించడంతో ఇంజిన్ల దిగ్గజం కమిన్స్‌ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్లోనూ అమ్మకాలు తలెత్తాయి. దీంతో లాభాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

ఆటోమోటివ్‌ స్టాంపింగ్స్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఆటోమోటివ్‌ స్టాంపింగ్స్‌ రూ. 9.5 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం పెరిగి రూ. 120 కోట్లను అధిగమించింది. ఇదే కాలంలో రూ. 2.4 కోట్ల నిర్వహణ నష్టం నమోదైంది. ఫలితాలు నిరాశపరచిన నేపథ్యంలో ప్రస్తుతం ఆటోమోటివ్‌ స్టాంపింగ్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 8.5 శాతం పతనమై రూ. 43 దిగువన ట్రేడవుతోంది. 

Image result for cummins india ltd

కమిన్స్‌ ఇండియా లిమిటెడ్‌
కంపెనీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందీప్‌ సిన్హా  రాజీనామా చేసినట్లు కమిన్స్‌ ఇండియా వెల్లడించింది. కమిన్స్‌ ఇండియా ఏబీవోకు వైస్‌ప్రెసిడెంట్‌గా సైతం విధులు నిర్వహిస్తున్న సందీప్‌ వ్యక్తిగత కారణాలతో పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు  కమిన్స్‌ ఇండియా పేర్కొంది. 2004లో సందీప్‌ కమిన్స్‌లో చేరారు. తదుపరి పలు బాధ్యతలు నిర్వహించారు. కంపెనీకి ఆవల వ్యక్తిగత అవకాశాలను అన్వేషించేందుకు సందీప్‌ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కమిన్స్‌ ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 2 శాతం క్షీణించి రూ. 740 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 5 శాతం పతనమై రూ. 711 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.