దివాన్‌- టాటా మోటార్స్.. బౌన్స్‌

దివాన్‌- టాటా మోటార్స్.. బౌన్స్‌

యాజమాన్యం నుంచి మరింత ఆర్థిక సంబంధ(ఫైనాన్షియల్‌) సమాచారం కావాలంటూ ఆడిటర్స్‌ డిమాండ్‌ చేసిన నేపథ్యంలో తొలుత పతన బాట పట్టిన ఎన్‌బీఎఫ్‌సీ కౌంటర్‌.. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ప్రస్తుతం రికవరీ బాట పట్టింది. కాగా.. మరోవైపు యూకే ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైన మద్దతు లభించినట్లు వెల్లడికావడంతో ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇతర వివరాలు చూద్దాం..

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
గత ఆర్థిక సంవత్సరం బ్యాలన్స్‌షీట్ రూపొందించేందుకు వీలుగా అదనపు సమాచారం కావాలంటూ కంపెనీ ఆడిటర్లు డెలాయిట్‌ హస్కిన్స్‌ అండ్‌ సెల్స్‌, చతుర్వేది అండ్‌ షా డిమాండ్‌ చేయడంతో దివాన్‌ హౌసింగ్‌ కౌంటర్లో తొలుత అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్ఎస్‌ఈలో ఈ షేరు 8 శాతంపైగా పతనమైంది. రూ. 44.50 వద్ద దశాబ్దకాలపు కనిష్టాన్ని తాకింది. తదుపరి కొనుగోళ్లు పెరగడంతో రికవరీ సాధించింది. ప్రస్తుతం దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 50 వద్ద ట్రేడవుతోంది. ఈ నె21లోగా ఆడిటర్లకు కంపెనీ అదనపు ఫైనాన్షియల్‌ సమాచారాన్ని అందించవలసి ఉంటుందని విశ్లేషకులు తెలియజేశారు. కంపెనీ అన్‌ఆడిటెడ్‌ ఫలితాలు ఇప్పటికే ప్రకటించింది. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 2233 కోట్ల నికర నష్టం ప్రకటించిన విషయం విదితమే.

Image result for Tata motors ltd

టాటా మోటార్స్‌
ఎలక్ట్రిక్‌ కార్ల అభివృద్ధికి వీలుగా యూకే ప్రభుత్వం నుంచి 50 కోట్ల పౌండ్ల(సుమారు రూ. 4200 కోట్లు) విలువైన రుణాలకు గ్యారంటీ లభించినట్లు టాటా మోటార్స్‌ తెలియజేసింది. ఇందుకు యూకే ప్రధాని థెరెసా మే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో టాటా మోటార్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో టాటా మోటార్స్ షేరు 2.3 శాతం పెరిగి రూ. 165 వద్ద ట్రేడవుతోంది.