ప్రతికూల ఓపెనింగ్‌ నేడు ?!

ప్రతికూల ఓపెనింగ్‌ నేడు ?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 14 పాయింట్లు క్షీణించి 11,537 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. గత వారం సరికొత్త గరిష్టాలను అందుకుంటూ సాగిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు  సోమవారం మరోసారి చరిత్రాత్మక గరిష్టాల వద్ద నిలిచాయి. అయితే దేశీయంగా కార్పొరేట్‌ ఫలితాలు, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అంశాలపై ఇన్వెస్టర్లలో కొంతమేర ఆందోళనలు తలెత్తినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో నేడు మళ్లీ దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా కదిలే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. 

సెంచరీతో ఖుషీ
గత వారమంతా ఒడిదొడుకుల మధ్య కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు సోమవారం మరోసారి ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,024 పాయింట్ల వరకూ పెరిగింది. 38,696 వద్ద కనిష్టాన్ని సైతం చవిచూసింది. చివరికి 160 పాయింట్లు జమచేసుకుని 38,897 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 36 పాయింట్లు ఎగసి 11,588 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,541 పాయింట్ల వద్ద, తదుపరి 11,494 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,627 పాయింట్ల వద్ద, తదుపరి 11,666 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 30,288, 30,130 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 30,650, 30,853 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 216 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 592 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి.