రుపీ.. 11 నెలల గరిష్టం

రుపీ.. 11 నెలల గరిష్టం

డాలరుతో మారకంలో ఇటీవల బలపడుతూ వస్తున్న దేశీ కరెన్సీ ఒక రోజు వెనకడుగు తదుపరి తిరిగి జోరందుకుంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 26 పైసలు ఎగసి 68.32 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం మరికొంత బలపడి 68.30కు చేరింది. ఇది 11 నెలల గరిష్టంకాగా.. బుధవారం రూపాయి 7 పైసలు బలహీనపడి 68.58 వద్ద ముగిసింది. డాలరుతో మారకంలో ఇంట్రాడేలో 68.67 వద్ద కనిష్టాన్నీ, 68.48 వద్ద గరిష్టాన్నీ తాకింది. చమురు ధరలు పుంజుకోవడం, దేశీ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తదితర ప్రతికూల అంశాల ప్రభావం చూపినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. కాగా.. మంగళవారం రూపాయి 15 పైసలు పుంజుకుని 68.51 వద్ద నిలవగా.. బడ్జెట్‌ తదుపరి సోమవారం రూపాయి 24 పైసలు నష్టపోయి 68.66 వద్ద ముగిసిన విషయం విదితమే.

గత వారం ర్యాలీ
సార్వత్రిక బడ్జెట్‌పై అంచనాలు, ఆర్‌బీఐ లిక్విడిటీ చర్యలు, డాలరు వెనకడుగు వంటి అంశాల నేపథ్యంలో గత వారమంతా రూపాయి బలపడుతూ వచ్చింది. బడ్జెట్‌ రోజు శుక్రవారం(5న) డాలరుతో మారకంలో రూపాయి 8 పైసలు పుంజుకుని 68.42 వద్ద ముగిసింది. కాగా.. గురువారం మరింత అధికంగా 39 పైసలు ఎగసి 68.50 వద్ద ముగిసింది. ఇదే విధంగా బుధవారం సైతం 6 పైసలు పుంజుకుని 68.89కు చేరగా.. మంగళవారం నామమాత్ర లాభంతో 68.95 వద్ద నిలిచింది. అయితే సోమవారం 9 పైసలు బలపడి 68.94 వద్ద ముగిసింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 69 మార్క్‌ దిగువకు పురోగమించింది. వెరసి గత వారం డాలరుతో మారంకలో రూపాయి 63 పైసలు లాభపడింది!Most Popular