ఇండిగోలో వార్- స్పైస్‌జెట్‌కు జోష్‌

ఇండిగోలో వార్- స్పైస్‌జెట్‌కు జోష్‌

ఇండిగో బ్రాండుతో విమానయాన సేవలు అందిస్తున్న ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ కంపెనీ ప్రమోటర్ల మధ్య విభేధాలు తలెత్తిన వార్తలతో ఈ కౌంటర్‌ బలహీనపడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టడంతో ఈ కౌంటర్‌ భారీ నష్టాలతో కళతప్పింది. అయితే మరోవైపు ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు నిలిచిపోవడంతో జోరందుకున్న చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ కౌంటర్‌కు మరోసారి డిమాండ్‌ పెరిగింది. దీంతో ఈ షేరు లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం..

ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్
ఇండిగో విమాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌తో లావాదేవీల అంశంపై ప్రమోటర్‌ రాకేష్‌ గంగ్వాల్‌ సహప్రమోటర్‌ రాహుల్‌ భాటియాపై ఆరోపణలు చేస్తున్నట్లు మీడియా పేర్కొంది. అయితే ఈ అంశంపై గత నెలలోనే భాటియా డైరెక్టర్ల బోర్డుతోపాటు.. కంపెనీ సెక్రటరీకి సైతం లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిర్యాదు చేయడంతోపాటు.. వాటాదారుల అసాధారణ సర్వసభ్య సమావేశాని(ఏజీఎం)కి గంగ్వాల్‌ పిలుపునిచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. తమ గ్రూప్‌ సంస్థలు.. కంపెనీ మధ్య లావాదేవీల విషయంలో ఆరోపణలు చేస్తున్న గంగ్వాల్‌ ఎలాంటి సమాచారాన్ని దాఖలు చేయలేదని భాటియా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రమోటర్ల మధ్య వివాదాలు చెలరేగిన వార్తలతో ప్రస్తుతం ఇంటర్‌గ్లోబ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఇండిగో షేరు 12 శాతంపైగా కుప్పకూలింది. రూ. 1376 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1265 దిగువకూ జారింది.

స్పైస్‌జెట్‌ లిమిటెడ్‌
ఆర్థిక సమస్యలతో జెట్ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రభుత్వం ద్వారా కొన్ని అదనపు రూట్లను పొందిన స్పైస్‌జెట్‌ కౌంటర్‌ ఇటీవల జోరందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇండిగో ప్రమోటర్ల మధ్య వివాదాలు, ఎయిర్‌ ఇండియా ప్రయివేటీకరణ తదితర అంశాల మధ్య మరోసారి ఈ కౌంటర్‌ వెలుగులోకి వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం బీఎస్ఈలో స్పైస్‌జెట్‌ షేరు 5.5 శాతం జంప్‌చేసింది. రూ. 124 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 9 శాతం ఎగసి రూ. 128ను సైతం అధిగమించింది.