కంపెనీ ఆడిటర్స్ రాజీనామాలు ! పెట్టుబడి దారులు ఏం చేయాలి? 

కంపెనీ ఆడిటర్స్ రాజీనామాలు !  పెట్టుబడి దారులు ఏం చేయాలి? 

బడ్జెట్ హడావిడి ముగిసింది. ఇక రానున్న రోజుల్లో కంపెనీల వార్షిక ఫలితాల వెల్లడి సమయం రానుంది. కానీ ఇప్పుడు మీడియాలో  కంపెనీ ఆడిటర్ల ఆకస్మిక రాజీనామాలే హెడ్ లైన్స్‌గా మారాయి. 2018లో సత్యం కంప్యూటర్స్ కేసు విషయంలో ప్రైస్ వాటర్ కూపర్స్ (PWC) పై సెబీ చర్యలు తీసుకున్న తరువాత మిగతా ఆడిటింగ్ కంపెనీలు జాగ్రత్త వహించడం మొదలు పెట్టాయి. బలహీన కంపెనీలు, మోసపూరిత కంపెనీలకు ప్రముఖ ఆడిటింగ్ కంపెనీలు దూరం జరగడం మొదలైంది. మోస పూరిత కంపెనీగా తేలితే.. ఆయా కంపెనీల ఆడిటర్ల మీద కూడా చర్యలు తీసుకోడం ప్రారంభం అయినందునే ఆడిటర్లు పలు కంపెనీలకు ముందు జాగ్రత్తగా రాజీనామాలు చేస్తున్నారని ప్రైమ్ డేటాబేస్ సంస్థ పేర్కొంది. పెద్ద పెద్ద ఆర్ధిక సంక్షోభాలు, కంపెనీల రుణ ఎగవేత, లేదా దివాల వంటివి జరిగినప్పుడు విచారణ సంస్థలు ఆడిటర్ల వైపే చూస్తున్నాయి. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, సత్యం కంప్యూటర్స్ వంటివి విఫలమైనప్పుడు ఇదే జరిగింది. IL&FS సంక్షోభం తరువాత కూడా ఈ ఆడిటర్ల రాజీనామాలు ప్రముఖంగా నిలిచాయి. తాజాగా రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫిన్ , ఎవరెడీ ఇండస్ట్రీస్ వంటి సంస్థలకు ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్ ( PWC ) రాజీనామా చేసింది. దీనికి కారణంగా ప్రైస్ వాటర్ సంస్థ 'ఆడిటింగ్‌లో అసంతృప్తికర సమాధానాల'ను కారణంగా చూపింది .

Image result for auditors quit walked out

ఒక కంపెనీ స్టాక్స్ కొనుగోలుకు ముందు ఇన్వెస్టర్లు ఆ కంపెనీ ఆడిటర్ ఎవరన్న దానిని కూడా పరిశీలిస్తున్నారు. దీంతో ఆడిటర్లు ఒకింత ఒత్తిడిలోనే ఉన్నారని మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ సంస్థ పేర్కొంది. అంతే కాకుండా దివాలా కోడ్ (IBC), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) వంటివి బ్యాంకర్లు, ఆడిటర్ల మీద చురుకైన నిఘాను పెంచింది. రుణ ఎగవేత దారులు, డిఫాల్ట్ కంపెనీల విషయంలో ఆడిటర్ల పాత్రపై ప్రభుత్వ విచారణ సంస్థలు ఆరా తీస్తున్నాయి. దీంతో ఆడిటర్లు తమకెందుకు వచ్చిన తలనొప్పి అనుకుంటూ ఆయా సంస్థల నుండి వైదొలుగుతున్నారు. ఇందుకు ఉదాహరణగా IL&FS సంస్థ నుండి ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ గా ఉన్న BSR అసోసియేట్స్ రాజీనామా చేసిన ఉదంతాన్ని చెప్పుకోవచ్చు. సెబీ , MCA వంటి సంస్థలు ఆడిటర్లపై చర్యలు తీసుకుంటున్నందున ప్రముఖ ఆడిటింగ్ కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. జాతీయ ప్రొఫెషనల్ అకౌంటింగ్ బాడీ ICAI కూడా ప్రభుత్వ చర్యలకు, లేదా శిక్షకు గురైన ఆడిటర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టనుంది. ఈ ప్రభావంతో స్మాల్ క్యాప్ కంపెనీలైన కృతికా వైర్స్, సురానీ స్టీల్ ట్యూబ్స్ , సినీ విస్టా, వంటి కంపెనీల ఆడిటర్లు రాజీనామా చేశారు. నియంత్రణ సంస్థల చర్యల వల్ల ముందు జాగ్రత్తగా అనేక ఆడిట్ సంస్థలు అనుమానిత కంపెనీలను విడిచిపెడుతున్నాయి. 
Auditors
పెట్టుబడిదారులు ఏమి చేయాలి?
రిటైల్ పెట్టుబడిదారులకు ఈ రాజీనామాలు పెద్ద ప్రభావం చూపకపోవచ్చు. ట్రేడర్లు , ఇన్వెస్టర్లు తొలుత ఒక కంపెనీ ఆడిటర్‌ రాజీనామా చేసినపుడు , దాని ప్రభావాన్ని అంచంనా వేయాలి. సాధారణ కారణాల వల్ల రాజీనామాలు  జరిగితే మార్కెట్లు పెద్దగా స్పందించవు. కానీ.. కంపెనీ ధర, సున్నితమైన సమాచారాన్ని లీక్ చేయడం వంటి కారణాలతో ఆడిటర్లను తొలగించినప్పుడు మార్కెట్లు తీవ్రంగా స్పందిస్తాయి. వెంటనే ఆ కంపెనీల స్టాక్స్ కుప్పకూలే ప్రమాదం ఉంది. రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫిన్ సంస్థల నుండి ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ వైదొలగగానే ఆ స్టాక్స్ 32శాతం, 33శాతం పడిపోయాయి. ఆడిటర్స్ రాజీనామా అన్న వార్తను ఇన్వెస్టర్లు రెడ్ అలర్ట్ గానే భావించాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు. మన్‌ పసంద్ బేవరేజెస్ కంపెనీ నుండి డెలాయిట్ హస్కిన్స్ సంస్థ వైదొలగినప్పటి నుండి మన్ పసంద్ స్టాక్స్ పడుతూనే వస్తున్నాయి. రిటైల్ పెట్టుబడి దారులు తప్పించుకున్నా... సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం ఇరుక్కుపోయారు. ప్రస్తుతం ఈ స్టాక్స్ కౌంటర్ కొనుగోలు దారులు లేక వెలవెల బోతుంది. 

Image result for auditors quit walked out
రెగ్యులేటర్లు కూడా ఆడిటర్ రాజీనామాలను తేలికగా తీసుకోవడం లేదు మరియు స్పష్టమైన కారణాలు అడుగుతున్నారు. కొంతమంది ఆడిటర్లు నిర్దిష్ట కారణాలు చెప్పకుండా రాజీనామా చేస్తున్నారు. పెట్టుబడిదారులు ఈ పరిణామాలను ట్రాక్ చేయాలి. వారు పెట్టుబడి పెట్టిన సంస్థ యొక్క ఆడిటర్ కారణాలు చెప్పకుండా రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఇన్వెస్టర్లు కంపెనీ వ్యవహారాలు, నడవడికపై పరిశోధించాల్సిందే అని నిపుణులు సలహా ఇస్తున్నారు.