బజాజ్‌ ద్వయం.. అనూహ్య పతనం

బజాజ్‌ ద్వయం.. అనూహ్య పతనం

ఉన్నట్టుండి ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజాలు.. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ లిమిటెడ్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో గత ఐదు నెలల్లోలేని విధంగా బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు 10 శాతం కుప్పకూలింది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఒక దశలో రూ. 3375 వరకూ జారింది. ప్రస్తుతం దాదాపు 9 శాతం పతనంతో రూ. 3401 వద్ద ట్రేడవుతోంది. ఇంతక్రితం 2019 జనవరి చివర్లో మాత్రమే ప్రయివేట్‌ రంగ సంస్థ బజాజ్ ఫైనాన్స్‌ షేరు ఈ స్థాయిలో నష్టపోయింది. మరోవైపు బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేరు సైతం 10 శాతం పడిపోయింది. రూ. 7591 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 7463 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. కాగా.. ఇకపై ఈ కంపెనీల బిజినెస్‌ మందగమన పరిస్థితులను ఎదుర్కొవచ్చన్న అంచనాలు ఈ కౌంటర్లో అమ్మకాలకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇతర వివరాలు చూద్దాం..

ర్యాలీ బాటలో
గత ఏడేళ్లుగా లాభాల బాటలోనే సాగుతూ వస్తున్న బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు ఈ కేలండర్‌ ఏడాది(2019)లోనూ జోరు చూపుతూ వచ్చింది. గత వారం వరకూ 41 శాతం ర్యాలీ చేసింది. అయితే ఉన్నట్టుండి బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు రూటు మార్చుకోవడానికి కారణాలున్నాయంటున్నారు నిపుణులు. ఇటీవల చమురు ధరలు పుంజుకోవడం, తయారీ, కేపిటల్‌ గూడ్స్‌, ఆటో రంగాలు మందగమన బాట పట్టడం వంటి అంశాలు బిజినెస్‌పై కొంతమేర ప్రతికూల ప్రభావం చూపవచ్చంటూ బజాజ్‌ ఫైనాన్స్‌ వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ అంశంపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. 

పనితీరు పటిష్టం
పటిష్ట యాజమాన్యం, తగినంత లిక్విడిటీ, డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియో, పలు ప్రాంతాలకు విస్తరించడం తదితర సానుకూల అంశాలు బజాజ్‌ ఫైనాన్స్‌ పనితీరుకు దన్నుగా నిలవగలవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీరో వ్యయాల వాయిదా పథకాలలో ఇటీవల పోటీ తీవ్రతరమైంది. ప్రయివేట్‌ బ్యాంకులు సైతం ఈఎంఐ మార్కెట్‌పై దృష్టిపెట్టాయి. అయినప్పటికీ కంపెనీ గతేడాదిలో అధిక వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. నిర్వహణలోని ఆస్తులు 41 శాతం వృద్ధి చూపగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 60 శాతం ఎగసింది.