పతన మార్కెట్లోనూ భళా.. ఈ షేర్లు

పతన మార్కెట్లోనూ భళా.. ఈ షేర్లు

ఆసియా మార్కెట్ల నష్టాలు, నిరాశపరచిన బడ్జెట్‌ తదితర ప్రతికూలతల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లలో వరుసగా రెండో రోజు అమ్మకాలు ఊపందుకున్నాయి. సెన్సెక్స్‌ 600 పాయింట్లకుపైగా పతనమైంది. 39,000 పాయింట్ల కీలక మార్క్‌ దిగువకు చేరింది. అయితే ఇంత పతనంలోనూ కొన్ని మధ్య, చిన్నతరహా కౌంటర్లు ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో బీఎఫ్‌ యుటిలిటీస్‌, స్వెలెక్ట్ ఎనర్జీ, డాక్టర్‌ లాల్‌ పాథ్‌ లేబ్స్, కేసర్‌ టెర్మినల్స్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం...

బీఎఫ్‌ యుటిలిటీస్‌ లిమిటెడ్: ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు దాదాపు 16 శాతం దూసుకెళ్లి రూ. 202 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 204 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో ఈ కౌంటర్‌ గత నెల రోజుల సగటు 35,200 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 2.8 లక్షల షేర్లు చేతులు మారాయి. 

స్వెలెక్ట్‌ ఎనర్జీ సిస్టమ్స్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు దాదాపు 10 శాతం దూసుకెళ్లి రూ. 279 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో ఈ కౌంటర్‌ గత నెల రోజుల సగటు 5,000 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 21,000 షేర్లు చేతులు మారాయి. కంపెనీ వాటాదారులకు బోనస్‌ షేర్ల జారీ ప్రతిపాదనను గత వారమే ప్రకటించింది. 

కేసర్‌ టెర్మినల్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 53.60 వద్ద ఫ్రీజయ్యింది. అంతా కొనుగోలుదారులే తప్ప అమ్మేవాళ్లు కరవుకావడమే దీనికి కారణం. బీఎస్‌ఈలో ఈ కౌంటర్‌ గత నెల రోజుల సగటు 8,400 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 22,500 షేర్లు ట్రేడయ్యాయి.

డాక్టర్‌ లాల్‌ పాథ్‌ లేబ్స్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 4.25 శాతం జంప్‌చేసి రూ. 1124 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1137 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. బీఎస్‌ఈలో ఈ కౌంటర్‌ గత నెల రోజుల సగటు 4,000 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 62,000 షేర్లు ట్రేడయ్యాయి.