2 రోజుల్లో 1000 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ! కారణాలివే..?

2 రోజుల్లో 1000 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ! కారణాలివే..?

గత శుక్రవారం నాటి బడ్జెట్ తరువాత నేటి సోమవారం వరకూ స్టాక్ మార్కెట్లు కోలుకోలేదు. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు నష్టపోయింది. సోమవారం నాటి మార్కెట్లో సెన్సెక్స్ మధ్యాహ్నం నాటికి దాదాపు 647 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా 247పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. బడ్జెట్ నాటి శుక్రవారం రోజున నిఫ్టీ , సెన్సెక్స్ దాదాపు 1శాతం నష్టపోయాయి. బడ్జెట్ లోని కొన్ని అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. బడ్జెట్ తో బాటు కొన్ని గ్లోబల్ పరిమాణాలు కూడా మార్కెట్లను దెబ్బతీసాయి. అమెరికా ఉద్యోగ కల్పన, ఫెడ్ రేట్ల తగ్గింపు , MSCIs ఇండెక్స్ నష్టపోవడం, క్రూడ్ ధరలు వంటి అంశాలు మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. 
1. కంపెనీల బై బ్యాక్ షేర్ల లావాదేవీలపై ట్యాక్స్ విధించనుండటం, పెద్ద కంపెనీల్లో ప్రజల వాటాను 35శాతంగా పెంచడం వంటివి మార్కెట్లను నిరాశ పరిచాయని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. 
2. చాలా కంపెనీలు తమ పబ్లిక్ షేర్ హోల్డింగ్‌ను పెంచుకోవాల్సి వస్తుంది. ఎక్కువ ప్రమోటర్ల షేర్లను అమ్మకానికి పెట్టడం, లేదా అదనపు ఈక్విటీలను జారీ చేయాల్సి రావడం కూడా మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతినడానికి కారణమని కార్వే బ్రోకింగ్ సంస్థ అభిప్రాయపడింది. 
3. బడ్జెట్ ప్రతిపాదనలను చాలా మంది మార్కెట్ ఎనలిస్టులు స్వాగతించినప్పటికీ.. ఇన్వెస్టర్ల అంచనాలను ఈ బడ్జెట్ అందుకోలేక పోవడం, వారు ఊహించిన దానికి విరుద్ధంగా ఆర్ధిక ఉద్దీపన ప్రణాళికలు లేక పోవడం వల్లే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయని ఎనలిస్టులు అంటున్నారు. 
4. 2020 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఈ బడ్జెట్ సరైన దిశలో ఉన్నప్పటికీ... అధిక ఇన్‌కమ్ ట్యాక్స్ ఇష్యూ మరియు మ్యూచువల్ ఫండ్స్, PMS  వంటి వాటిపై అధిక ఛార్జీలు వంటివి మార్కెట్లను నిరాశకు లోను చేశాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్ రంగంలో ఇది ప్రతికూలతను చూపిస్తుందని యెస్ సెక్యూరిటీస్ పేర్కొంది. BSE మిడ్ క్యాప్ సూచీ 1.5శాతం నష్టపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తోంది యెస్ సెక్యూరిటీస్
ఇక ఈ బడ్జెట్ హ్యాంగోవర్ తరువాత మార్కెట్ల దృష్టి ఆదాయాల సీజన్‌ వైపు మళ్ళుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. అంతే కాకుండా దిగ్గజ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల త్రైమాసిక ఫలితాలను ఈ జులై 9, 12 తేదీల్లో విడుదల కానున్నాయి. అలాగే స్థూల ఆర్ధిక రంగంలోని IIP, CPI ద్రవ్యోల్బణం రేషియోలు ఈ నెల 12న వెల్లడి కానున్నాయి. రుతుపవనాల గమనం, గ్లోబల్ క్యూస్ వంటి విషయాలపై కూడా ప్రస్తుతం ఇన్వెస్టర్ల చూపు ఉందన్న మాట మాత్రం వాస్తవం. మరో రెండు నెలల్లో మార్కెట్లు కొంత సానుకూలత చూపించవచ్చని ఎనలిస్టులు పేర్కొంటున్నారు.