కస్టమ్స్‌ పెంపు- కళ తప్పిన జ్యువెలరీ

కస్టమ్స్‌ పెంపు- కళ తప్పిన జ్యువెలరీ

ఆర్థిక మంత్రిగా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ నిర్మలా సీతారామన్‌ రూపొందించిన తొట్టతొలి బడ్జెట్‌లో బంగారం, బంగారు ఆభరణాల దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీని 2.5 శాతంమేర పెంచారు. దీంతో బంగారం తదితర విలువైన లోహాల దిగుమతులపై కస్టమ్స్‌ సుంకం ప్రస్తుతం అమలవుతున్న 10 శాతం నుంచి 12.5 శాతానికి పెరగనుంది. దీంతో జ్యువెలరీ తయారీ, ఎగుమతుల బిజినెస్‌ నిర్వహించే పలు కంపెనీల కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం...

ధరల దెబ్బ
ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు మెరుస్తూ వస్తున్నాయి. న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 1415 డాలర్ల వద్ద నిలకడగా కదులుతోంది. దీంతో దేశీయంగానూ బంగారం ధరలు ఊపందుకున్నాయి. దీంతో దేశీయంగా కొంతమేర ఆభరణ విక్రయాలు మందిగించినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు తాజాగా సార్వత్రిక బడ్జెట్‌లో 2.5 శాతం కస్టమ్స్‌ డ్యూటీ పెంచడంతో జ్యువెలరీ కంపెనీల షేర్లు అమ్మకాలతో డీలాపడ్డాయి.

నేలచూపుతో
ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో తంగమాయిల్‌ జ్యువెలరీ 6 శాతం పతనమై రూ. 317 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 313 దిగువకు జారింది. ఇక పీసీ జ్యువెలర్స్‌ 4.3 శాతం పతనమై రూ. 41 దిగువకు చేరింది. రూ. 40.20 వద్ద సరికొత్త కనిష్టాన్ని తాకింది. ఈ బాటలో గోల్డియమ్‌ ఇంటర్నేషనల్ 4.25 శాతం తిరోగమించి రూ. 120 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 117 వరకూ నీరసించింది. త్రిభువన్‌దాస్‌ భీమ్‌జీ జవేరీ(టీబీజెడ్‌) లిమిటెడ్‌ షేరు సైతం 3.4 శాతం క్షీణించి రూ. 43 వద్ద కదులుతోంది. తొలుత రూ. 42 దిగుకు చేరింది. ఇదే విధంగా రినైసెన్స్‌ గ్లోబల్‌ 1.4 శాతం నష్టంతో రూ. 272 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 270కు నీరసించింది. టైటన్‌ కంపెనీ 1 శాతం వెనకడుగుతో రూ. 1278 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1250 దిగువన ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. లిప్సా జెమ్స్‌ 2 శాతం క్షీణించి రూ. 5 దిగువన కదులుతోంది.