ఇండియామార్ట్‌.. లిస్టింగ్‌ భళా

ఇండియామార్ట్‌.. లిస్టింగ్‌ భళా

ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూ ముగించుకున్న  ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో 21 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 973కాగా.. ఎన్‌ఎస్‌ఈలో రూ. 207 లాభంతో రూ. 1180 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. తదుపరి రూ. 1230 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 25 శాతం(రూ. 243)  జంప్‌చేసి రూ. 1216 వద్ద ట్రేడవుతోంది. ఇండియామార్ట్‌.కామ్‌ పేరుతో బిజినెస్‌ ప్రొడక్టులు, సర్వీసులు నిర్వహించే ఆన్‌లైన్‌ సంస్థ ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ పబ్లిక్‌ ఇష్యూకి భారీ రెస్పాన్స్‌ లభించిన సంగతి తెలిసిందే. ఐపీవో ఏకంగా 36 రెట్లు అధిక  సబ్‌స్క్రిప్షన్‌ సాధించగా.. తద్వారా కంపెనీ రూ. 475 కోట్లు సమీకరించింది. 

కంపెనీ వివరాలు 
దేశీయంగా ఆన్‌లైన్‌లో బీటూబీ విక్రయాలకు అతిపెద్ద సంస్థగా ఇండియామార్ట్‌.. నిలుస్తున్నట్లు కేపీఎంజీ నివేదిక పేర్కొంది. 2017లో ఆన్‌లైన్‌ బీటూబీ విభాగంలో ప్రకటనలకు సంబంధించి కంపెనీ 60 శాతం మార్కెట్ వాటాను సాధించినట్లు తెలియజేసింది. కంపెనీ ప్రధానంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు సేవలు అందిస్తోంది. 2019 మార్చికల్లా కంపెనీలో నమోదైన వినియోగదారుల సంఖ్య 82.7 మిలియన్లుకాగా.. 5.5 మిలియన్‌ సరఫరాదారులు రిజిస్టర్‌ అయ్యారు.

యాంకర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌
ఐపీవో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి ఇండియామార్ట్‌ గత నెల 21న రూ. 213 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 973 ధరలో 15 యాంకర్‌ సంస్థలకు దాదాపు 22 లక్షల షేర్లను కేటాయించింది. కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన సంస్థలలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐలతోపాటు.. బిర్లా మ్యూచువల్‌ ఫండ్‌, హార్న్‌బిల్‌ కేపిటల్‌ తదితరాలున్నాయి.