ఇక టోల్ గేట్లలో క్యాష్ కడితే పెనాల్టీ !!

ఇక టోల్ గేట్లలో క్యాష్ కడితే పెనాల్టీ !!

టోల్ గేట్ల దగ్గర రద్దీని భారీగా తగ్గించడానికి, వాహనదారులందరినీ ఎలక్ట్రానిక్ పద్ధతుల్లోకి తీసుకురావడానికి కేంద్రం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అందుకే టోల్ గేట్ల దగ్గర టోల్ చెల్లింపును నగదుతో జరిపితే 10-20 శాతం అదనంగా వసూలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది జాతీయ రహదారుల నిర్వాహణా సంస్థ (ఎన్‌హెచ్ఏఐ). జనాలను ఫాస్టాగ్ వంటి ఎలక్ట్రానిక్ టోలింగ్ వైపునకు నడిపించేందుకు త్వరలో దీనిపై ప్రకటన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఫాస్టాగ్స్‌కు రాయితీల్లేవ్
ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్ టోల్ గేట్స్ దగ్గర ఫాస్టాగ్‌ను వినియోగిస్తున్నవారికి పది శాతం వరకూ రాయితీని ఇస్తున్నారు. అయినా దీనిని వినియోగించుకుంటున్న వాళ్ల 10 శాతం లోపే ఉందని హైవే అథారిటీ ఓ నిర్ధారణకు వచ్చింది. అందుకే నగదుతో టోల్ చెల్లింపు విధానానికి దశలవారీగా పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోంది. ఎందుకంటే.. ఈ నగదు చెల్లింపుల వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడడం, విపరీతమైన కాలుష్యానికి కారణమవుతోందని ఇంతకాలానికి గుర్తించారు. టోల్ ఒప్పందాల కారణంగా ఇప్పటికిప్పుడు రద్దీ రూట్లలో కూడా అదనపు గేట్లను పెట్టడానికి కూడా వీలు లేదు కాబట్టి బలవంతంగానైనా ఎలక్ట్రానిక్ టోల్ పద్ధతిని పెట్టాలని చూస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే, ఇప్పుడున్న డిస్కౌంట్ పద్ధతికి చెక్ చెప్పాలని అనుకుంటున్నారు. 

ఐదేళ్లుగా ఫాస్టాగ్
జాతీయ రహదారుల నిర్వాహణా సంస్థ 2014లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడి)ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఈ ఫాస్టాగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో సర్వీస్ ప్రొవడైర్ ఇచ్చే ఓ స్టిక్కర్‌ను కార్ పై అంటించుకోవాల్సి ఉంటుంది. సదరు కార్డ్‌లో ఆన్ లైన్ ద్వారా డబ్బును లోడ్ చేసుకోవచ్చు. ఆ స్టిక్కర్ టోల్ గేట్ దగ్గరుండే ఆటోమేటిక్ మెషీన్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మన ఖాతా నుంచి డబ్బును డిడక్ట్ చేస్తారు. మనషుల ప్రమేయం ఏమీ ఉండదు కాబట్టి వాహనాలు ఈ ప్రత్యేక గేట్ నుంచి వేగంగా వెళ్లిపోవచ్చు. 

ఇక క్యాష్ కౌంటర్లు కొన్నే
నగదు తీసుకుని టోల్ టికెట్లు ఇచ్చే కౌంటర్లను తగ్గించడం వల్ల తప్పనిసరిగా వాహనదారులు ఫాస్టాగ్‌కు మారతారని ఎన్ హెచ్ ఏ ఐ భావిస్తోంది. ప్రస్తుతం ఈ నిర్వాహణ సంస్థ చూసుకుంటున్న 400 టోల్ గేట్లలో కేవలం 30 శాతం  మాత్రమే ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో టోల్ తీసుకుంటున్నారు. దీన్ని 90 శాతానికి పెంచి నగదు లావాదేవీలను 10 శాతానికి పరిమితం చేయాలనే లక్ష్యంగా సాగుతున్నారు. 

డిజిటలైజేషన్ సాధ్యపడ్తుందా ?
టోల్ గేట్లలో నగదు లేకుండా సాధ్యపడ్తుందా అంటే.. ఖచ్చితంగా సాధ్యపడ్తుంది. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దు సమయంలో మనమంతా ఒక్కసారిగా డిజిటల్ దిశగా అడుగులు వేశాం. పేటిఎం, గూగుల్ పే, అమెజాన్ పే, ఫోన్ పే అంటూ కిరాణా, పాలు, పూలకు కూడా డబ్బులు చెల్లించేస్తున్నాం. అలాంటి తరుణంలో ఇది సాధ్యం కాకపోవడమనేది ఉండకపోవచ్చనేది నిపుణుల  నమ్మకం. దీనికి తోడు నగదుతో చెల్లిస్తే.. పది నుంచి ఇరవై శాతం అధికంగా డబ్బులు చెల్లించాల్సి వస్తే, జనాలు ఇంకా వేగంగా ఎలక్ట్రానిక్ పద్ధతివైపు మారిపోతారని చెబ్తున్నారు. 
అయితే ఇక్కడ ఉన్న చిక్కు ఏంటంటే.. కొన్ని పాత టోల్ గేట్లలో ఎలక్ట్రానిక్ వ్యవస్థ లేదు. వాళ్లపై ఒత్తిడి తెస్తున్నా.. ఇంకా పాత పద్ధతులకే పరిమితవుతున్నారు. ఈ నేపధ్యంలో టోల్ ఓనర్లను కూడా ప్రోత్సాహకాలు ఇచ్చి మార్చాలని చూస్తున్నారు. 


 


 Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');