బడ్జెట్ తరువాత ఈ 10 స్టాక్స్ దూసుకుపోయే ఛాన్స్!!

బడ్జెట్ తరువాత ఈ 10 స్టాక్స్ దూసుకుపోయే ఛాన్స్!!

మోదీ 2.O బడ్జెట్ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ మార్కెట్ వర్గాలను కుదిపేస్తుంది. ఈ బడ్జెట్ లో ప్రధానంగా ఇన్ఫ్రా, మూల ధన ఇన్వెస్ట్‌మెంట్ సైకిల్స్‌లో సంస్కరణల మీద దృష్టి పెట్టొచ్చని ఆర్ధిక వర్గాల అంచనా. వ్యవసాయం, రూరల్ డెవలప్‌మెంట్‌ విభాగాలకు ఎక్కువ కేటాయింపులు కూడా ఉండొచ్చన్నది మార్కెట్ ఎనలిస్టుల అంచనాగా ఉంది. గత 5 ఏళ్ళుగా దేశ ఆర్ధిక పురోభివృద్ధి మందగించడంతో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ 2019 ఎలా ఉండబోతుందా అని మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. GDP వృధ్ధి మందకోడిగా సాగడం, గత మార్చ్ త్రైమాసికానికి జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతానికి పరిమితం కావడం వంటివి  ప్రధాని మోదీ సర్కార్‌ ముందున్న పెద్ద సవాల్ . ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఆర్ధిక సంస్కరణలకు ఊతమిస్తామని ప్రకటించడం కూడా రానున్న బడ్జెట్ సానుకూలంగా ఉండొచ్చన్న సంకేతాలను ఇచ్చింది. నగదు కొరత, నాన్ బ్యాంకింగ్ కంపెనీలకు లిక్విడిటీ సమస్యల పరిష్కారం దిశగా ఆర్బీఐ చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకింగ్ కంపెనీలు , స్టాక్ విశ్లేషకులు బడ్జెట్ తరువాత రాణించే కొన్ని స్టాక్స్ ను సూచించారు . అవేంటో చూద్దాం...!
కార్వే స్టాక్ బ్రోకింగ్ అంచనాలు
లార్సెన్ &టుబ్రో
ఈ బడ్జెట్‌లో ఇన్ఫ్రా స్ట్రక్చర్‌ రంగానికి పెద్ద పీట వేయనున్నందున క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ రాణించవచ్చు. అలాగే లార్సెన్ అండ్ టుబ్రో ఆర్డర్ బుక్ కూడా  మంచి కాంట్రాక్టులతో నిండి ఉండటం కూడా L&T కి కలిసొచ్చే అంశంగా మారింది. మార్చ్ 2019 నాటికి కంపెనీ ఆర్డర్‌ బుక్‌లో ఉన్న ఆర్డర్ల వాల్యూ రూ. 2,93,400 కోట్లుగా ఉంది. దేశీయ ప్రైవైట్ సెక్టార్‌లోనూ , పబ్లిక్ సెక్టార్‌లోనూ ఎల్‌అండ్ టీ కి మంచి వర్క్ ఆర్డర్లు ఉన్నాయి. 
మహీంద్ర & మహీంద్ర
గ్రామీణ ఉపాథి, మౌలిక వసతులు వంటి వాటితో రూరల్ డెవలప్‌మెంట్‌కు ఈ బడ్జెట్‌లో అధిక కేటాయింపులు జరిగినట్టైతే.. మహీంద్ర & మహీంద్ర  కంపెనీ అధికంగా లాభపడనుంది. ట్రాక్టర్ ఇండస్ట్రీ, వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తుల  విక్రయాలు మరింత పెరగొచ్చన్నది కార్వే బ్రోకింగ్ సంస్థ అంచనా. 
KRBL 
ఈ బడ్జెట్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు కేటాయింపులు జరిగినట్టైతే.. KRBL కంపెనీ స్టాక్స్ మరింత ఆకర్షణీయంగా మరొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతుల్లో KRBL మంచి పురోగతిని కనబరుస్తూ వస్తోంది. ఇక దేశీయంగా కూడా బాసుమతి బియ్యాన్ని డిమాండ్ పెరగడంతో KRBL ఉత్పత్తుల విక్రయాలు ఊపందుకున్నాయి. 

నార్నోలియా ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనాల ప్రకారం
LIC హౌజింగ్ ఫిన్:
హోమ్ లోన్ సెగ్మెంట్‌లో ఇతర పోటీ సంస్థలు నగదు కొరతతో బాధపడుతుండగా LIC హౌజింగ్ ఫైనాన్స్ మాత్రం దూసుకెళ్తుంది. సౌకర్యవంతమైన గృహ నిర్మాణ రంగానికి ప్రభుత్వం కనుక పెద్ద పీట వేస్తే.. LIC హౌజింగ్ స్టాక్స్ మరింత ఆకర్షణీయంగా మారుతాయి. అంతే కాకుండా ఈ సంస్థకు క్రెడిట్ రేటింగ్స్ కూడా 'AAA' గా ఉండటం కలిసొచ్చే అంశం. 
అల్ట్రాటెక్ సిమెంట్ :
ఈ బడ్జెట్‌లో ఇన్ఫ్రా, ప్రతి ఒక్కరికి సొంతిల్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటి  పథకాలకు  కేటాయింపులు జరిగితే అల్ట్రాటెక్ సిమెంట్ వంటి స్టాక్స్ వేగంగా పుంజుకోవచ్చని నార్నోలియా ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేస్తోంది. గృహ నిర్మాణాలు ఊపందుకుంటే.. సిమెంట్‌కు గిరాకీ పెరగొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. 
PNC ఇన్ఫ్రాటెక్:
ఈ బడ్జెట్‌లో రూరల్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యమిస్తే కనుక ఇన్ఫ్రా రంగంలోని PNC ఇన్ఫ్రాటెక్ స్టాక్స్ మంచి లాభాలను అందించవచ్చని ఎనలిస్టుల అంచనా. ఎందుకంటే.. ఇప్పటికే ఈ కంపెనీకి 7 హైబ్రీడ్ ఆన్యుటీ మోడల్ (HAM ) కాంట్రాక్టులు ఉన్నాయి. వీటిలో 6 పూర్తి అయ్యాయి. బిల్డ్ ఆపరేట్ ట్రాన్సఫర్ కింద నడిచే పలు ప్రాజెక్టుల కాంట్రాక్టులు కూడా  PNC ఇన్ఫ్రా వద్ద ఉండటం కలిసొచ్చే అంశంగా మారింది. 2020 ఆర్ధిక సంవత్సరం నాటికి ఈ సంస్థ వద్ద రూ. 7000-8000 వేల కోట్ల  వర్క్ ఆర్డర్లు ఉంటాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. 
అలాగే ఛాయిస్ బ్రోకింగ్ సంస్థ ... హిందుస్థాన్ యూనీలివర్, వా టెక్ వాబాగ్ (Va Tech Wabag) , శ్రీకాళహస్తి పైప్స్, JSW స్టీల్,  వంటి స్టాక్స్ బడ్జెట్ తరువాత మరింతగా రాణిస్తాయని అంచనా వేస్తోంది.   

Disclaimer: పైన పేర్కొన్న సలహాలు , సూచనలు ప్రముఖ బ్రోకింగ్ కంపెనీలు, ఎనలిస్టులచే ఇవ్వబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవి.