ఈ వారం చాల విశేషాలున్నాయ్‌ సుమా!

ఈ వారం చాల విశేషాలున్నాయ్‌ సుమా!

దేశీ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం పలు కీలక అంశాల ఆధారంగా రియాక్ట్‌కానున్నాయి. వీటిలో దేశీయంగా చూస్తే.. ప్రధాని మోడీ అధ్యక్షతన తొలిసారి మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరిలో స్వల్పకాలిక(మధ్యంతర) బడ్జెట్‌ను ప్రకటించినప్పటికీ ఈసారి బడ్జెట్‌లో పలు కీలక సంస్కరణలకు తెరతీయనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. శుక్రవారం(జులై 5న) ఆర్థిక మంత్రి సీతారామన్‌ లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ప్రస్తుతానికి ఇన్వెస్టర్లు బడ్జెట్‌ అంచనాలపై దృష్టి సారించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇతర అంశాలను చూద్దాం...

Related image

జీ20పై చూపు
జపాన్‌లోని ఒసాకాలో శుక్రవారం(28) ప్రారంభమైన జీ20 సమావేశాలకు ఈసారి ప్రపంచ దేశాలు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల అమెరికా, చైనా దేశాధినేతల మధ్య చర్చలు జరగనుండటమే దీనికి కారణం. కొన్ని నెలలుగా సాగుతున్న వాణిజ్య వివాదాల పరిష్కార దిశగా అగ్రనేతలు ట్రంప్‌, జిన్‌పింగ్‌ సమావేశంకానున్నారు. ఇప్పటికే అమెరికా, యూరోపియన్‌, జపనీస్‌ కేంద్ర బ్యాంకులు అవసరమైతే సరళతర విధానాలవైపు చూపుసారించనున్నట్లు తెలియజేశాయి. అమెరికా, చైనా వాణిజ్య వివాదాల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక మందగమన పరిస్థితులు తలెత్తుతున్నట్లు పలువురు ఆర్థికవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఒపెక్‌ దేశాల మీటింగ్‌
చమురు ఎగుమతి దేశాల సమితి(ఒపెక్‌)సహా రష్యా తదితర దేశాలు వియన్నాలో జులై 1-2న సమావేశంకానున్నాయి. అమెరికా, చైనా వాణిజ్య వివాదాల కారణంగా చమురుకు డిమాండ్‌ క్షీణించవచ్చన్న అంచనాలు దీనికి కారణంకాగా.. ధరలను నిలిపేందుకు ఇప్పటికే అమలు చేస్తున్న ఉత్పత్తిలో కోతలపై సమావేశంంలో చర్చించనున్నారు. ధరల నిలకడకు వీలుగా చమురు ఉత్పత్తిలో కోతలను కొనసాగించడం లేదా పెంచే ప్రణాళికలతో వియన్నా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Image result for monsoon

వర్షపాతానికీ ప్రాధాన్యం
దేశవ్యాప్తంగా ఇటీవల రుతుపవనాలు విస్తరిస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అయితే జూన్‌లో పలుచోట్ల తక్కువ వర్షపాతం నమోదవుతున్నట్లు తెలియజేసింది. ఫలితంగా వ్యవసాయ రంగానికి కీలకమైన జులై, ఆగస్ట్‌ వర్షాలపై అటు రైతులు, ఇటు ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నట్లు నిపుణలు పేర్కొంటున్నారు. 

Image result for Auto sales

ఆటో షేర్ల పరుగెటు?
బడ్జెట్‌, జీ20, వర్షాలతోపాటు.. చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి పలు అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. జూన్‌ నెలలో వాహన విక్రయ గణాంకాలు సోమవారం(జులై 1) నుంచి వెలువడనున్నాయి. దీంతో తొలి దశలో ఆటో రంగ కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడయ్యే అవకాశముంది.