డెడ్ ఛీప్‌గా ఉన్నాయని కొంటే...! ఇక అంతే సంగతులు!!

డెడ్ ఛీప్‌గా ఉన్నాయని కొంటే...! ఇక అంతే సంగతులు!!

ప్రస్తుతం దేశీ మార్కెట్లలో చాలా స్టాక్స్ పూర్తిగా నిరాశ పరుస్తున్నాయనే చెప్పొచ్చు. BSE లోని ప్రతీ 6 స్టాక్స్ లో కనీసం ఒక స్టాక్ పూర్తిగా పతనం అయినవే కనబడుతున్నాయి. ఇదే సమయంలో లార్జ్ క్యాప్ స్టాక్స్ డబుల్ డిజిట్ ప్రాఫిట్లను కనబరుస్తున్నాయి. BSE లోని దాదాపు 70శాతం స్టాక్స్ రికార్డు స్థాయి కనిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఇన్వెస్టర్ల సంపదను సుమారు 50-95శాతం ఆవిరయ్యేలా చేశాయి ఈ స్టాక్స్. ఆయా కంపెనీల్లో నగదు కొరత, అధిక రుణ భారాలు, ప్రమోటర్ల షేర్లు తనఖాలో ఉండటం, కార్పోరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వంటి కారణాలతో ఈ స్టాక్స్ పతనం బాటలో పయనిస్తున్నాయి. మార్కెట్లో చాలా మంది ఇన్వెస్టర్లు ఇలాంటి స్టాక్స్ ను కొనుగోలు చేసి 'వాల్యూ ట్రాప్‌' లో ఇరుక్కున్నారని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.  
BSE లోని 547 స్టాక్స్‌లో 383 స్టాక్స్ 52 వారాల గరిష్టం నుండి 50-95 శాతం తమ మార్కెట్ వాల్యూను కోల్పోయాయి. అనిల్ అంబానీకి చెందిన అడాగ్ గ్రూప్ షేర్లలో రిలయన్స్ కమ్యునికేషన్స్ షేర్లు 95 శాతం నష్టపోయాయి. రిలయన్స్ ఇన్ఫ్రా 92శాతం, రిలయన్స్ పవర్ 89శాతం, రిలయన్స్ హోమ్ ఫిన్ 86 శాతం , రిలయన్స్ నావల్ 84 శాతం నష్టపోయాయి. అడాగ్ కంపెనీలకు రేటింగ్ సంస్థలు క్రెడిబిలిటీని తగ్గించడం, డెట్ పేపర్స్ మీద రేటింగ్స్ ను డిఫాల్ట్ గా నిర్ణయించడంతో ఒకప్పుడు ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన అనిల్ అంబానీ ఇప్పుడు లక్షాధికారిగా మాత్రమే మిగిలిపోయాడు. 
అలాగే దేశీయ ప్రముఖ ప్రైవేట్ విమాన యాన దిగ్గజం జెట్ ఎయిర్ వేస్ స్టాక్స్ కూడా నేల మట్టం అయిపోయాయి. బ్యాంక్రప్టసీ వివాదాలు, రుణ ఎగవేతల కారణంగా జెట్ స్టాక్స్ 93శాతం కుప్పకూలాయి. మరో దిగ్గజ కంపెనీ అయిన జయప్రకాష్ అసోసియేట్స్ 86శాతం, మన్‌పసంద్ బేవరేజెస్ 86శాతం, సింటెక్స్ ప్లాస్టిక్స్ టెక్నాలజీస్ 84శాతం నష్టపోయాయి. ఇవి తిరిగి కోలుకునే అవకాశం కూడా లేదని మార్కెట్ ఎనలిస్టులు ఘంటాపథంగా చెప్తున్నారు. ఒకప్పుడు భారీ ఆస్తులు కలిగి ఉన్న ఈ స్టాక్స్ నగదు కొరత, రుణ భారాలు వంటి కారణాలతో కుదేలయ్యాయి. 
వీటితో బాటు ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా, సిటీ నెట్‌వర్క్స్ , బల్లాపూర్ ఇండస్ట్రీస్, నవకార్ కార్ప్, కాక్స్ & కింగ్స్, శంకర బిల్డింగ్ ప్రోడక్ట్స్, జేపీ ఇన్ఫ్రా వంటి కంపెనీల స్టాక్స్ కూడా ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేశాయి. 
మొత్తం మీద చూస్తే.. మార్కెట్లో అత్యధిక పతనానికి గురైన స్టాక్ ఏదీ అంటే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యునికేషన్స్ అనే చెప్పాలి. 2008 లో రూ. 844 ఉన్న ఈ షేర్ వాల్యూ రూ. 1.20 పైసలకు పడిపోయింది. 99.9శాతం పడిన స్టాక్ ఇదే కావడం విశేషం.  అదేవిధంగా 2008 ఫిబ్రవరిలో రిలయన్స్ పవర్ రూ. 599.90 వద్ద ట్రేడ్ అయిన ఈ స్టాక్ 99.3శాతం నష్టపోయి రూ. 4.16 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది.  మార్కెట్లో 98శాతానికి పైగా నష్టపోయిన స్టాక్స్ లో జయప్రకాష్ పవర్ వెంచర్స్, HDIL, బోంబే రేయాన్ ఫ్యాషన్స్, సిటీ నెట్‌వర్క్స్ , రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి స్టాక్స్ ఉన్నాయి.