ఇండియామార్ట్‌ ఐపీవో.. సూపర్‌ సక్సెస్‌

ఇండియామార్ట్‌ ఐపీవో.. సూపర్‌ సక్సెస్‌

ఇండియామార్ట్‌.కామ్‌ పేరుతో బిజినెస్‌ ప్రొడక్టులు, సర్వీసులు నిర్వహించే ఆన్‌లైన్‌ సంస్థ ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ పబ్లిక్‌ ఇష్యూకి భారీ రెస్పాన్స్‌ లభించింది. ఐపీవో ఏకంగా 36 రెట్లు అధిక  సబ్‌స్క్రిప్షన్‌ సాధించింది. ఈ నెల 24న ప్రారంభమై 26న ముగిసిన ఇష్యూకి ప్రైస్‌ బ్యాండ్‌ రూ. 970-973కాగా.. దాదాపు 48.9 లక్షల షేర్లను కంపెనీ విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 475 కోట్లు సమీకరించాలని కంపెనీ భావించింది. 

సబ్‌స్క్రిప్షన్‌ స్పీడ్‌
సంస్థాగత ఇన్వెస్టర్ల కోటాలో 31 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 62 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలుకాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగం నుంచి సైతం 13 రెట్లు అధికంగా దరఖాస్తులు దాఖలయ్యాయి. ఫలితంగా ఐపీవోలో భాగంగా కంపెనీ 2.7 మిలియన్‌ షేర్లకు విక్రయానికి పెడితే.. మొత్తం 96.92 మిలియన్‌ షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. 

కంపెనీ వివరాలు 
దేశీయంగా ఆన్‌లైన్‌లో బీటూబీ విక్రయాలకు అతిపెద్ద సంస్థగా ఇండియామార్ట్‌.. నిలుస్తున్నట్లు కేపీఎంజీ నివేదిక పేర్కొంది. 2017లో ఆన్‌లైన్‌ బీటూబీ విభాగంలో ప్రకటనలకు సంబంధించి కంపెనీ 60 శాతం మార్కెట్ వాటాను సాధించినట్లు తెలియజేసింది. కాగా.. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా ఇండియామార్ట్‌ ప్రమోటర్లు దినేష్ చంద్ర అగర్వాల్‌, బ్రిజేష్‌ కుమార్‌ అగర్వాల్‌ 14.3 లక్షల షేర్లను విక్రయించారు. కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన ఇంటెల్‌ కేపిటల్‌(మారిషస్‌) అమెడ్యూస్‌ ఐవీ తదితర సంస్థలు 34.6 లక్షల షేర్లవరకూ అమ్మకానికి పెట్టాయి. కంపెనీ ప్రధానంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు సేవలు అందిస్తోంది. 2019 మార్చికల్లా కంపెనీలో నమోదైన వినియోగదారుల సంఖ్య 82.7 మిలియన్లుకాగా.. 5.5 మిలియన్‌ సరఫరాదారులు రిజిస్టర్‌ అయ్యారు.

యాంకర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌
ఐపీవో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి ఇండియామార్ట్‌ ఈ నెల 21న రూ. 213 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 973 ధరలో 15 యాంకర్‌ సంస్థలకు దాదాపు 22 లక్షల షేర్లను కేటాయించింది. కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన సంస్థలలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐలతోపాటు.. బిర్లా మ్యూచువల్‌ ఫండ్‌, హార్న్‌బిల్‌ కేపిటల్‌ తదితరాలున్నాయి.