టైర్‌ కంపెనీలకు ప్రభుత్వ పుష్‌

టైర్‌ కంపెనీలకు ప్రభుత్వ పుష్‌

చైనా నుంచి దిగుమతయ్యే రేడియల్‌ టైర్లపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కౌంటర్‌వెయిలింగ్‌ డ్యూటీని విధించినట్లు వెలువడిన వార్తలు దేశీ కంపెనీలకు జోష్‌నిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఒడిదొడుకుల మార్కెట్లోనూ టైర్ల తయారీ దేశీ కంపెనీల కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. స్థానిక మార్కెట్‌లో చైనా నుంచి దిగుమతయ్యే టైర్లు ప్రధాన పోటీదారుగా నిలుస్తుండటంతో దేశీయంగా టైర్ల తయారీ కంపెనీలకు ఉపశమనం లభించనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో టైర్ల తయారీ కంపెనీల షేర్లు లాభాల పరుగందుకున్నాయి. వివరాలు చూద్దాం..

కొనుగోళ్ల స్పీడ్‌
ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో టైర్ల తయారీ దిగ్గజం ఎంఆర్‌ఎఫ్‌ షేరు 2.5 శాతం ఎగసి రూ. రూ. 56,020 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 56,339 వరకూ ఎగసింది. ఈ బాటలో ఆఫ్‌రోడ్‌ టైర్ల తయారీ సంస్థ బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ షేరు 3.2 శాతం పుంజుకని రూ. 765ను తాకింది. తొలుత ఒక దశలో రూ. 770 వరకూ లాభపడింది. జేకే టైర్స్ 4.2 శాతం జంప్‌చేసి రూ. 80కు చేరగా.. సియట్‌ 3.2 శాతం పెరిగి రూ. 931 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 940 వరకూ ఎగసింది. ఇదే విధంగా టీవీఎస్‌ శ్రీచక్ర 3 శాతం పురోగమించి రూ. 1878కు చేరింది. తొలుత రూ. 1897 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇక అపోలో టైర్స్‌ 1 శాతం బలపడి రూ. 202 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 205కు పెరిగింది. అయితే బీఎస్‌ఈలో గుడ్‌ఇయర్‌ షేరు తొలుత రూ. 959 వరకూ లాభపడినప్పటికీ ప్రస్తుతం 0.6 శాతం నీరసించి రూ. 944 వద్ద ట్రేడవుతోంది!Most Popular