ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు- ఆపై?!

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు- ఆపై?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు మరోసారి అక్కడక్కడే అన్నట్టు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 8 పాయింట్లు తక్కువగా 11,708 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. జీ20 దేశాల సమావేశాల్లో భాగంగా వాణిజ్య వివాద పరిష్కారం కోసం శుక్రవారం ట్రంప్‌, జిన్‌పింగ్‌ చర్చలు చేపట్టనున్నారు. అయితే ఇరాన్‌తో వివాదాల నేపథ్యంలో సోమవారం అమెరికా, యూరోపియన్‌ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ బలహీన ట్రెండ్‌ కనిపిస్తోంది. దీంతో నేడు కూడా దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

నేలచూపుతోనే ముగింపు
ఇటీవల ఆటుపోట్లకు లోనవుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు సోమవారం మరోసారి అదే బాటలో నడిచాయి. అయితే స్వల్ప స్థాయిలోనే  హెచ్చుతగ్గులను చవిచూశాయి. ఆద్యంతం కన్సాలిడేషన్‌ దిశలో సాగి చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 72 పాయింట్లు క్షీణించి 39,123 వద్ద నిలిచింది. నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 11,700 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11754 వద్ద గరిష్టాన్నీ, 11670 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక ట్రేడింగ్ ప్రారంభంలో 39,300 వరకూ ఎగసిన సెన్సెక్స్‌ తదుపరి 39,022వరకూ డీలాపడింది.

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,662 పాయింట్ల వద్ద, తదుపరి 11,624 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,746 పాయింట్ల వద్ద, తదుపరి 11,792 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 30,492, 30,382 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 30,748, 30,894 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 207 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 984 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. వారాంతాన ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 731 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 446 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.



Most Popular