నేడు ఫ్లాట్‌ ఓపెనింగ్‌?!

నేడు ఫ్లాట్‌ ఓపెనింగ్‌?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్టు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 10 పాయింట్లు పుంజుకుని 11,640 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈ నెలాఖరున జపాన్‌లో జరగనున్న జీ20 దేశాల సమావేశాల్లో ట్రంప్‌, జిన్‌పింగ్‌.. వాణిజ్య వివాద పరిష్కారం కోసం చర్చలు చేపట్టనున్న వార్తలతో గురువారం హైజంప్‌ చేసిన అమెరికా స్టాక్ మార్కెట్లు ఇరాన్‌ అమెరికా మధ్య వివాదాలు ముదరడంతో వారాంతాన డీలాపడ్డాయి. ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ తొలుత 2,964 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకున్నప్పటికీ తదుపరి వెనకడుగు వేసింది. కాగా.. శుక్రవారం దేశీయంగానూ ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లు పతనమైన విషయం విదితమే.

పతనంతో ముగింపు
వారాంతాన బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 407 పాయింట్లు పతనమైంది. 39,194 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 108 పాయింట్లు కోల్పోయి 11,724 వద్ద నిలిచింది. ఫెడ్‌ వడ్డీ తగ్గింపు అంచనాలతో గురువారం అమెరికన్‌ మార్కెట్లు జోరందుకున్నప్పటికీ.. ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ట్రేడర్ల షార్ట్స్‌ బిల్డప్‌కుతోడు ఇన్వెస్టర్ల అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,677 పాయింట్ల వద్ద, తదుపరి 11,629 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,800 పాయింట్ల వద్ద, తదుపరి 11,875 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 30,511, 30,395 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 30,775, 30,922 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల వెనకడుగు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 731 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 446 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. గురువారం(20న) సైతం ఎఫ్‌పీఐలు రూ. 438 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 1241 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.



Most Popular