NBFCల సంక్షోభంతో డెట్ ఫండ్ల పరిస్థితి అగమ్యగోచరమేనా..? 

NBFCల సంక్షోభంతో డెట్ ఫండ్ల పరిస్థితి అగమ్యగోచరమేనా..? 

సాధారణంగా చిన్న మదుపర్లు, స్టాక్ మార్కెట్ల గురించి రిస్క్ ఉందని భావించేవారు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులను పెట్టడం చేస్తుంటారు. వీరి నుండి పెట్టుబడులు స్వీకరించిన మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఆ మొత్తాన్ని పలు రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తుంటారు. వీటిలో ప్రధానంగా ఫండ్ మేనేజర్లు ఎన్‌బీఎఫ్‌సీల్లో ( నాన్ బ్యాంకింగ్ రంగం) మదుపు చేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. NBFC సంక్షోభం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌కు చుట్టుకుందనే చెప్పాలి. ఎన్‌బీఎఫ్‌సీల్లో పెట్టిన పెట్టుబడులను ఎలా వెనక్కి తీసుకురావాలో తెలియక మ్యూచువల్ ఫండ్స్ తలపట్టుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని MF సంస్థలు కొన్ని పెట్టుబడులను మొండి బకాయిలుగా చూపి ఫండ్ల NAV ని తగ్గించేశాయి. మరి కొన్ని MF సంస్థలు తమ ఆస్తుల నుండి డబ్బు సర్దుబాటు చేసే యత్నం చేస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో డెట్ పథకాల విషయంలో మదుపర్లలో ఆందోళన మొదలయ్యింది. 
HDFC అసెట్ మేనేజ్‌మెంట్ :
ఎస్సెల్ గ్రూప్ సంస్థలో HDFC అసెట్ మేనేజ్‌ మెంట్  చేసిన ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్ (FMP) ఎమౌంట్ ఇప్పటి వరకూ వెనక్కి రాలేదు. దీంతో గడువు ముగిసిన FMP ల పెట్టుబడులను మదుపర్లకు వెనక్కి చెల్లించడానికి HDFC అసెట్ మేనేజ్‌ మెంట్ సంస్థ తన ఆస్తుల నుండి చెల్లించనున్నట్టు ప్రకటించింది. దీంతో HDFC షేర్ ఒక్కసారిగా కల్లోలంగా మారింది. దాదాపు రూ. 500 కోట్ల చెల్లింపుల సమస్యను HDFC ఎసెట్‌ మేనేజ్‌ మెంట్ సంస్థ ఎదుర్కొవడం ఇక్కడ గమనార్హం. 
IL&FS సంక్షోభం నుండే ఈ కష్టాలు... !
నాన్ బ్యాకింగ్ రంగ సంస్థలకు నగదు కొరత సమస్య వేధిస్తుండటం, IL&FS కంపెనీ సంక్షోభం తరువాత NBFC లకు రుణాలు దొరకకపోవడం తో పలు సంస్థలు రుణ చెల్లింపులను చేయలేక చేతులెత్తేస్తున్నాయి. దీంతో వీటిలో పెట్టుబడులను పెట్టిన పలు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, బ్యాంకులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. స్వల్పకాలిక రుణాలు తీసుకుని దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడంతో సమస్య మొదలైందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. డిపాజిట్లు నిరంతరం వస్తునే ఉంటాయి కాబట్టి వాటితో సర్దుబాటు చేసుకోవచ్చని NBFC కంపెనీల యోచన. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదనే చెప్పాలి. IL&FS సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో బ్యాంకులు కూడా ఇతర నాన్ బ్యాంకింగ్ కంపెనీలకు రుణాలు ఇవ్వడం మానేశాయి. దీంతో అవి పూర్తి నష్టాల్లోకి జారుకున్నాయి. 
మదుపర్ల ఆందోళన...!
ఎన్‌బీఎఫ్‌సీల్లో పెట్టుబడులు ఉన్న ఫండ్‌ సంస్థల్లోని పథకాల్లో మదుపు చేసిన మదుపరులు తమ పెట్టుబడి ఎక్కడ తగ్గిపోతుందో అనే ఆందోళనతో ఉన్నారు. ఆయా ఫండ్లలో తమ యూనిట్లను విక్రయించడం ప్రారంభించారు. దీంతో ఫండ్‌ మేనేజర్లు కూడా ఆయా ఫండ్లకు సంబంధించి పెట్టుబడులను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఎన్‌బీఎఫ్‌సీలపై మరింత ఒత్తిడిని పెంచింది. వీటికి అటు కొత్త ఎఫ్‌డీలు రాక.. వ్యవధి తీరినవి పునరుద్ధరణ లేకపోవడం.. ఆస్తులను అమ్ముకోలేక డెట్‌ మార్కెట్‌లో పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది. ఏప్రిల్  నెలలో మార్కెట్ల నుండి రూ.4వేల కోట్ల మేరకు డెట్‌ ఫండ్ల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ఈ నెలలో ఇది మరింత ఎక్కువగానే ఉండొచ్చనేది మార్కెట్‌ వర్గాల అంచనా. HDFC , DHFL, వంటి పలు మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. మదుపర్లు తమ వద్ద పెట్టిన పెట్టుబడులు ఒక్కసారిగా వెనక్కి తీసుకోవాలనుకుంటే.. పరిస్థితి మరో పెను సంక్షోభానికి దారి తీయవచ్చని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. 
 



Most Popular