నష్టాలలో.. మెటల్‌ వీక్‌- ఫార్మా ప్లస్‌

నష్టాలలో.. మెటల్‌ వీక్‌- ఫార్మా ప్లస్‌

గత వారం హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్‌ బాట పట్టిన దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి బలహీనంగా ప్రారంభమయ్యాయి. తదుపరి అమ్మకాలదే పైచేయి కావడంతో నేలచూపులతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 168 పాయింట్లు క్షీణించి 39,284కు చేరగా.. నిఫ్టీ 57 పాయింట్ల వెనకడుగుతో 11,766 వద్ద కదులుతోంది. ఈ వారం ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రధానంగా టెక్నాలజీ, చిప్‌ కౌంటర్లలో అమ్మకాల కారణంగా నాస్‌డాక్‌ బలహీనపడింది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియాలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా కదులుతున్నాయి. 

ఇండస్‌ఇండ్‌ డౌన్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలహీనపడగా.. ఫార్మా 0.5 శాతం పుంజుకుంది. మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, బ్యాంక్స్‌ 1.25-0.5 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, వేదాంతా, గ్రాసిమ్‌, ఆర్‌ఐఎల్‌, యాక్సిస్‌, కోల్‌ ఇండియా, గెయిల్‌, అల్ట్రాటెక్, టాటా స్టీల్‌ 2-1.25 శాతం మధ్య నీరసించాయి. బ్లూచిప్స్‌లో.. ఇన్‌ఫ్రాటెల్‌, ఎయిర్‌ఎటెల్‌, పవర్‌గ్రిడ్‌ మాత్రమే అదికూడా 1-0.5 శాతం మధ్య బలపడ్డాయి.

పీసీ పతనం
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో పీసీ జ్యువెలర్స్‌ 15 శాతం, జెట్‌ ఎయిర్‌వేస్‌ 12 శాతం చొప్పున కుప్పకూలగా..  రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ కేపిటల్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, జైన్‌ ఇరిగేషన్‌, సీజీ పవర్‌, సెయిల్‌, ఇన్ఫీబీమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 9-2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు దివాన్‌, సుజ్లాన్‌, పిరమల్‌, దివీస్‌, అరబిందో, హెక్సావేర్‌, ఇండియన్‌ బ్యాంక్‌, రేమండ్‌, భెల్‌ 4.5-1 శాతం మధ్య ఎగశాయి. 

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు నష్టాలతో కదులుతున్న నేపథ్యంలో చిన్న షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4 శాతం చొప్పున క్షీణించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 746 నష్టపోగా.. 404 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఆర్‌జీఎల్‌, కామధేను, ఇమామీ రియల్టీ, ప్రైకోల్‌, పీజీఈఎల్‌, ఈరోస్‌, పోకర్ణ, విండ్‌సర్‌, మన్‌పసంద్‌ తదితరాలు 11-5 శాతం మధ్య పతనమయ్యాయి.



Most Popular