చివర్లో పతనం- రియల్టీ, మీడియా డీలా

చివర్లో పతనం- రియల్టీ, మీడియా డీలా

వరుసగా మూడో రోజు బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో రోజంతా నేలచూపులతోనే కదిలాయి. చివర్లో అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ ఒక దశలో 300 పాయింట్లకుపైగా పతనమైంది. నిఫ్టీ సైతం 100 పాయింట్లకుపైగా కోల్పోయింది. చివరికి సెన్సెక్స్‌ 289 పాయింట్లు క్షీణించి 39,452 వద్ద నిలవగా.. నిఫ్టీ 91 పాయింట్ల వెనకడుగుతో 11,823 వద్ద స్థిరపడింది. కాగా.. చమురు ధరలు పుంజుకోవడంతో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడినప్పటికీ నేటి ట్రేడింగ్‌లో ఆసియాలో బలహీన ధోరణి కనిపించింది.  

బ్యాంక్స్‌ డౌన్‌
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, మీడియా రంగాలు 2.4 శాతం చొప్పున క్షీణించగా.. బ్యాంక్స్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, మెటల్‌ 1.5-1 శాతం మధ్య నీరసించాయి. మీడియా స్టాక్స్‌లో డిష్‌ టీవీ, ఈరోస్‌, జీ, నెట్‌వర్క్‌ 18, టీవీ టుడే, జాగరణ్‌, సన్‌ టీవీ, జీ మీడియా 6.3-1.3 శాతం మధ్య వెనకడుగు వేశాయి. రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్‌, డీఎల్‌ఎఫ్‌, శోభా, సన్‌టెక్‌, ఒబెరాయ్‌, ప్రెస్టేజ్‌, బ్రిగేడ్‌ 5-1.3 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, ఐబీ హౌసింగ్‌, ఎయిర్‌టెల్‌, ఐషర్‌, యాక్సిస్‌, కొటక్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, యస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 4.5-2 శాతం మధ్య పతనమయ్యాయి. బ్లూచిప్స్‌లో.. ఇన్‌ఫ్రాటెల్‌, ఎల్‌అండ్‌టీ, సన్‌ ఫార్మా మాత్రమే అదికూడా 1.5-0.5 శాతం మధ్య బలపడ్డాయి.

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు నష్టాలతో ముగిసిన నేపథ్యంలో చిన్న షేర్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. దీంతో బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1-0.5 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1717 నష్టపోగా.. 801 మాత్రమే లాభాలతో ముగిశాయి. 

డీఐఐల అమ్మకాలు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గురువారం రూ. 172 కోట్లు ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 445 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. అయితే బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1050 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కితీసుకోగా.. దేశీ ఫండ్స్‌ రూ. 271 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.



Most Popular