6 నెలల్లో పాతాళానికి అడాగ్‌ షేర్లు

6 నెలల్లో పాతాళానికి అడాగ్‌ షేర్లు

ఆర్థికపరమైన ఒత్తిళ్లు, నష్టాలు పెరగడం, ఆస్తుల విక్రయంలో విఫలం, ఆడిటర్ల రాజీనామా తదితర సమస్యలతో కుదేలవడంతో అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) కంపెనీల షేర్లు వరుస అమ్మకాలతో బోర్లా పడుతున్నాయి. గత ఆరు నెలలుగా అడాగ్‌ గ్రూప్‌లోని పలు షేర్లు నేలచూపులతోనే కదులుతున్నాయి. గత ఏడు రోజుల్లో సెంటిమెంటు బలహీనపడటంతో ఇన్వెస్టర్లు మరింత భారీస్థాయిలో అమ్మకాలకు తెరతీశారు. వెరసి గత ఆరు నెలల్లో అడాగ్‌ షేర్లు సగటున 80-50 శాతం మధ్య విలువను కోల్పోగా.. గత ఏడు ట్రేడింగ్‌ సెషన్లలోనే 40-20 శాతం మధ్య పతనంకావడం గమనార్హం! ఇతర వివరాలు చూద్దాం..

పాతాళమే హద్దు
అడాగ్‌ కౌంటర్లలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 60 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 58 దిగువన సరికొత్త కనిష్టానికి చేరింది. కంపెనీ నేడు గతేడాది(2018-19) చివరి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఈ బాటలో రిలయన్స్ కేపిటల్ ప్రస్తుతం 7.6 శాతం కుప్పకూలి రూ. 78 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు సైతం తొలుత రూ. 76.50 వద్ద చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇక రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ 6 శాతం దిగజారి రూ. 14కు చేరగా.. రిలయన్స్‌ నావల్‌ 2.4 శాతం వెనకడుగుతో రూ. 6.20 వద్ద, రిలయన్స్‌ పవర్‌ 2 శాతం నష్టంతో రూ. 5.5 వద్ద, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 3 శాతం క్షీణించి రూ. 1.60 వద్ద ట్రేడవుతున్నాయి. వీటిలో అత్యధిక శాతం కౌంటర్లు కొత్త కనిష్టాలను చవిచూస్తున్నాయి!

నేలచూపులే
గత ఆరు నెలల్లోనూ అడాగ్‌ షేర్లు భారీగా డీలాపడ్డాయి. 2018 డిసెంబర్‌ 31 నుంచి చూస్తే.. ఆర్‌కామ్‌ 90 శాతం, ఆర్‌ఇన్‌ఫ్రా 82 శాతం, ఆర్‌పవర్‌ 81 శాతం, ఆర్‌కేపిటల్‌, రిలయన్స్ హోమ్‌ 66 శాతం, ఆర్‌నావల్‌ 56 శాతం చొప్పున పతనమయ్యాయి. 

రిలయన్స్‌ నిప్పన్‌ ఓకే
రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ షేరు అడాగ్‌ నష్టాల బారి నుంచి తప్పించుకోవడమేకాకుండా బలహీన మార్కెట్లోనూ నిలదొక్కుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 1.6 శాతం పుంజుకుని రూ. 219 వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీలో అడాగ్‌ వాటాను జపనీస్‌ భాగస్వామ్య సంస్థ నిప్పన్‌ లైఫ్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');