లిస్టింగ్‌ తదుపరి.. నియోజెన్‌.. కేక

లిస్టింగ్‌ తదుపరి.. నియోజెన్‌.. కేక

స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాక దూకుడు చూపుతున్న స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ సంస్థ నియోజెన్‌ కెమికల్స్‌ కౌంటర్‌ మరోసారి జోరు చూపుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు దాదాపు 18 శాతం దూసుకెళ్లి రూ. 363కు చేరింది. ఇంట్రాడేలో రూ. 364.50ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఈ కంపెనీ నెల రోజుల క్రితమే లిస్టింగ్‌ పొందింది. మే 8న లిస్టయిన కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ ధర రూ. 215తో పోలిస్తే .. ఇప్పటివరకూ 57 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఈ బాటలో గత నెల రోజుల్లో 31 శాతం ఎగసింది. నేటి ట్రేడింగ్‌లో లావాదేవీల పరిమాణం సైతం మూడు రెట్లు పుంజుకుని 4 లక్షలను తాకడం గమనార్హం! ఇతర వివరాలు చూద్దాం..

ఫలితాలు భేష్‌
బ్రోమైన్‌, లిథియం ఆధారిత కెమికల్‌ ప్రొడక్టుల తయారీ సంస్థ నియోజెన్‌ కెమికల్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2018-19)లో పటిష్ట ఫలితాలు సాధించింది. నికర లాభం దాదాపు రెట్టింపునకు ఎగసి రూ. 21 కోట్లను తాకింది. అంతక్రితం అంటే 2017-18లో కంపెనీ రూ. 11 కోట్లు మాత్రమే ఆర్జించింది. నిర్వహణ ఆదాయం సైతం 46 శాతం పెరిగి రూ. 239 కోట్లకు  చేరింది. వడోదర ప్లాంటులో ఉత్పాదకత పెంచుకోవడం, విభిన్న ప్రొడక్టులు రూపొందించడం వంటి అంశాలు పనితీరు మెరుగుకు దోహదపడినట్లు కంపెనీ తెలియజేసింది. దీంతో ఇబిటా మార్జిన్లు సైతం 17.8 శాతం నుంచి 18.2 శాతానికి బలపడ్డాయి. కంపెనీ ప్రొడక్టులను ఫార్మా, అగ్రి, రిఫ్రిజిరేషన్‌, పాలిమర్‌, ఫ్లేవర్స్‌ తదితర పలు రంగాలలో వినియోగిస్తుంటారు.Most Popular