నేడు ప్రతికూల ఓపెనింగ్‌?!

నేడు ప్రతికూల ఓపెనింగ్‌?!

ముందురోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు కొంతమేర ప్రతికూలంగా మొదలయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 26 పాయింట్లు క్షీణించి 11,955 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. వరుసగా ఆరు రోజులపాటు లాభాల బాటలోసాగిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్పంగా వెనకడుగు వేశాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపింది. కాగా.. వరుసగా మూడు రోజులపాటు లాభపడటంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లలోనూ ఒడిదొడుకులు కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
40,000-12,000కు చేరువలో....!
మంగళవారం అమెరికా, ఆసియా మార్కెట్లు లాభాలలో కొనసాగడంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో వరుసగా రెండో రోజూ సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. చివరికి చెప్పుకోదగ్గ లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 166 పాయింట్లు ఎగసి 39,950కు చేరగా.. నిఫ్టీ 43 పాయింట్లు పుంజుకుని 11,966 వద్ద స్థిరపడింది. వెరసి సెన్సెక్స్‌ 40,000 పాయింట్లు, నిఫ్టీ 12,000 పాయింట్ల మైలురాళ్లకు సమీపంలో ముగిశాయి. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,066-39,760 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఈ బాటలో నిఫ్టీ 12,000-11,904 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూడటం గమనార్హం! 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,913 పాయింట్ల వద్ద, తదుపరి 11,861 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 12,009 పాయింట్ల వద్ద, తదుపరి 12,053 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 31,026, 30,787 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 31,452, 31,639 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

డీఐఐల విక్రయాలు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం రూ. 96 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 151 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. నగదు విభాగంలో సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 216 కోట్లు,  డీఐఐలు రూ. 171 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌చేశాయి. 



Most Popular