40,000-12,000కు చేరువలో....!

40,000-12,000కు చేరువలో....!

అమెరికా, ఆసియా మార్కెట్లు లాభాలలో కొనసాగడంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో వరుసగా రెండో రోజూ సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. చివరికి చెప్పుకోదగ్గ లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 166 పాయింట్లు ఎగసి 39,950కు చేరగా.. నిఫ్టీ 43 పాయింట్లు పుంజుకుని 11,966 వద్ద స్థిరపడింది. వెరసి సెన్సెక్స్‌ 40,000 పాయింట్లు, నిఫ్టీ 12,000 పాయింట్ల మైలురాళ్లకు సమీపంలో ముగిశాయి. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,066-39,760 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఈ బాటలో నిఫ్టీ 12,000-11,904 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూడటం గమనార్హం! 

పీఎస్‌యూ బ్యాంక్స్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌. మెటల్‌, మీడియా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఐటీ రంగాలు 1.7-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌, జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ, వేదాంతా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ, టాటా స్టీల్‌ 3-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐబీ హౌసింగ్‌ 8 శాతం పతనంకాగా, సన్‌ ఫార్మా, ఎంఅండ్‌ఎం, బీపీసీఎల్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఫిన్‌, బాటా ఇండియా, పవర్‌గ్రిడ్‌ 3-0.5 శాతం మధ్య క్షీణించాయి.

పీసీ జోరు
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో డిష్‌ టీవీ 13 శాతం, పీసీ జ్యువెలర్స్‌ 10 శాతం చొప్పున దూసుకెళ్లగా..  జైన్‌ ఇరిగేషన్‌, ఆర్‌పవర్‌, ఇన్ఫీబీమ్‌, బిర్లాసాఫ్ట్‌, వొకార్డ్‌, టీవీ 18, సుజ్లాన్‌ 9.4-4.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క జెట్‌ ఎయిర్‌వేస్‌ 10 శాతం పతనంకాగా.. ఉజ్జీవన్‌, అజంతా ఫార్మా, జూబిలెంట్‌ ఫుడ్‌, ఐసీఐసీఐ ప్రు, ఎన్‌సీసీ, హెక్సావేర్‌ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి.

మిడ్‌ క్యాప్స్‌ ప్లస్‌
మార్కెట్లు జోరుగా ముగిసిన నేపథ్యంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ వెలుగులోకి వచ్చాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.8 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.25 శాతం చొప్పున పుంజుకున్నాయి. అయితే ట్రేడైన షేర్లలో 1398 నష్టపోగా.. 1152 లాభపడ్డాయి. 

పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 216 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 171 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌చేశాయి. కాగా..  శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 479 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 180 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. 



Most Popular