డిహెచ్ఎఫ్ఎల్ ఢమాల్ అంటే ఈ రెండు ఫండ్స్‌కు చుక్కలే !

డిహెచ్ఎఫ్ఎల్ ఢమాల్ అంటే ఈ రెండు ఫండ్స్‌కు చుక్కలే !

దివాన్ హౌసింగ్ పరిస్థితి దినగండం నూరేళ్ల ఆయుష్షులా తయారైంది. అప్పులన్నీ తీర్చేస్తున్నామని, ఎలాంటి ఆందోళనా అక్కర్లేదని యాజమాన్యం పదే పదే చెబ్తున్నా ఇన్వెస్టర్లు, రుణదాతల్లో మాత్రం నమ్మకం అంతంతే ఉంది. ఎప్పుడు ఏం జరగుతుందో అనే ఆందోళన నెలకొన్న నేపధ్యంలో దివాన్‌ రుణపత్రాలు కొన్న రెండు మ్యూచువల్ ఫండ్ సంస్థలకు నిద్రపట్టడం లేదు. వాటిల్లో యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఒకటైతే, మరొకటి రిలయన్స్ మ్యూచువల్ ఫండ్. 

తాజాగా బయటకు వచ్చిన లెక్కల ప్రకారం యూటీఐ మ్యూచువల్ ఫండ్, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర రూ.2918 కోట్ల రుణపత్రాలు (మొత్తం ఎక్స్‌పోజర్‌ రూ. 5236.50 కోట్లు) ఉన్నట్టు తేలింది. అన్నింటికంటే ఎక్కువగా యూటీఐకి ఎక్కువగా ప్రభావం ఉండబోతోంది. ఎందుకంటే ఉన్న రూ.2918 కోట్ల ఎక్స్‌పోజర్‌లో రూ.1736.68 కోట్ల వాళ్లదే. యూటీఐలో ఉన్న వివిధ డెట్ స్కీమ్స్‌లో డిహెచ్ఎఫ్ఎల్ రుణపత్రాలను వాళ్లు కొనిపెట్టారు. ఇక రిలయన్స్ ఫండ్ హౌస్‌కు కూడా రూ.1182 కోట్ల రిస్క్ కనిపిస్తోంది. 

డిహెచ్ఎఫ్ఎల్ నుంచి మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు రావాల్సిన సొమ్ము రూ.5236.53 కోట్లుగా ఉంది. ఇందులో రూ.4323.14 కోట్లు డెట్ స్కీములో, రూ.890 కోట్లు హైబ్రిడ్ స్కీమ్‌లో, రూ.23 కోట్లు ఈక్విటీ స్కీములో ఉన్నాయి. 

తేరుకున్న రిలయన్స్
డిహెచ్ఎఫ్ఎల్ ఇబ్బందుల నేపధ్యంలో రిలయన్స్ ఎంఎఫ్ కాస్త తేరుకుంది. తన ఎక్స్‌పోజర్‌ను జూన్ నాలుగోతేదీ నాటికి రూ.479 కోట్లకు తగ్గించుకుంది. అయితే ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగింది. ఈ మధ్య తన ఇన్వెస్టర్లకు ఇచ్చిన సమాచారం ప్రకారం..డిహెచ్ఎఫ్ఎల్‌లో 100 శాతం నష్టం రావొచ్చనే అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అంటే జూన్ 4వ తేదీన మెచ్యూర్ అయ్యే సెక్యూరిటీల డబ్బు రాబోదని ముందే ఓ అంచనాకు వచ్చారు. ఇక భవిష్యత్తులో మెచ్యూర్ కాబోయే బాండ్లకు రేటింగ్ ఏజెన్సీలు డి రేటింగ్ ఇచ్చిన నేపధ్యంలో వాటి రిస్క్ కూడా అధికంగానే ఉందని తేల్చిచెప్పారు. 
మొత్తానికి యూటీఐ మ్యూచువల్ ఫండ్, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, డిహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా ఫండ్, డిఎస్‌పి మ్యూచువల్ ఫండ్ సంస్థలకు డిహెచ్ఎఫ్ఎల్ దెబ్బ పడబోతోంది.