ఇండియాబుల్స్‌ గ్రూప్‌ స్టాక్స్‌.. బేర్‌!

ఇండియాబుల్స్‌ గ్రూప్‌ స్టాక్స్‌.. బేర్‌!

దాదాపు రూ. లక్ష కోట్ల నిధులను దారిమళ్లించిందన్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఇండియాబుల్స్‌ గ్రూప్‌నకు చెందిన లిస్టెడ్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌ షేరు 5 శాతం పడిపోయి రూ. 697 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 671 వరకూ దిగజారింది. ఈ బాటలో ఇండియాబుల్స్ రియల్టీ దాదాపు 5 శాతం తిరోగమించి రూ. 121 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 117 దిగువకు నీరసించింది. ఇండియాబుల్స్ వెంచర్స్‌ 6.3 శాతం పతనమై రూ. 271 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 262 వరకూ జారింది. ఇక ఐబీ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ దాదాపు 10 శాతం కుప్పకూలి రూ. 230 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 228 వరకూ క్షీణించింది. ఐబీ కన్జూమర్ ఫైనాన్స్‌ 4.5 శాతం పతనమై రూ. 941 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఐబీ హౌసింగ్‌లో విలీనానికి సిద్ధపడుతున్న లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌ కౌంటర్లోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 4 శాతం పతనమై రూ. 70 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 67 వరకూ వెనకడుగు వేసింది. ఇతర వివరాలు చూద్దాం..

వ్యక్తిగత అవసరాలకు
ఇండియాబుల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ గెహ్లాట్‌సహా ఇతర డైరెక్టర్లు వ్యక్తిగత అవసరాలకోసం రూ. 98,000 కోట్ల పబ్లిక్‌ నిధులను దారిమళ్లించినట్లు సుప్రీం కోర్టులో ఈ నెల 10న(సోమవారం) పిటిషన్‌ దాఖలైంది. ఈ అంశంపై చట్టపరమైన చర్యలు తీసుకోమంటూ పిటిషనర్‌ కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇన్వెస్టర్‌గా చెప్పుకుంటున్న అభయ్‌ యాదవ్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. స్పెయిన్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ హరీష్‌ ఫెబియానీ సహాయంతో గెహ్లాట్ పలు షెల్‌ కంపెనీలను సృష్టించారని, వీటికి అక్రమ రుణాల ద్వారా ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌ భారీ స్థాయిలో నిధులను మళ్లించిందని పిటిషన్‌లో అభయ్‌ ఆరోపించారు. అయితే ఇండియాబుల్స్‌ గ్రూప్‌పై అక్రమంగా బురదజల్లుతున్నట్లు గ్రూప్‌ చైర్మన్‌ గెహ్లాట్‌ పేర్కొన్నారు. ఐబీ హౌసింగ్‌ మొత్తం రుణాల విలువే రూ. 90,000 కోట్లుకాగా.. అక్రమంగా రూ. 98,000 కోట్లు దారిమళ్లించారన్న ఆరోపణలు అర్ధంలేనివని తెలియజేశారు.