సానుకూల ఓపెనింగ్‌ నేడు?!

సానుకూల ఓపెనింగ్‌ నేడు?!

ముందురోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి సానుకూలంగా మొదలయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 28 పాయింట్లు బలపడి 11,970 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు చేపట్టవచ్చన్న అంచనాలు, మెక్సికో వివాదాలు సద్దు మణగడం తదితర సానుకూల అంశాల కారణంగా సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు బలపడ్డాయి. వెరసి వరుసగా ఆరో రోజు లాభాలతో ముగిశాయి. ఈ ప్రభావం నేడు దేశీయ మార్కెట్లపై కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
ఐటీ, ఎఫ్‌ఎంసీజీ దన్ను- చివరికి లాభాలే
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహకర సంకేతాలతో సోమవారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరివరకూ సానుకూలంగానే కదిలాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో వరుసగా రెండో రోజు మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అయితే ట్రిపుల్‌ సెంచరీతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ముగిసేసరికి 168 పాయింట్లు పెరిగి 39,784 వద్ద నిలిచింది. ఈ బాటలో తొలుత 11,975 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన నిఫ్టీ సైతం చివరికి 52 పాయింట్లు బలపడి 11,923 వద్ద స్థిరపడింది. అమెరికా నుంచి ఆసియా వరకూ స్టాక్‌ మార్కెట్లు జోరందుకోవడంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే కొనుగోళ్లకు ఎగబడటంతో స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి.

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,871 పాయింట్ల వద్ద, తదుపరి 11,820 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,974 పాయింట్ల వద్ద, తదుపరి 12,026 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 30,808, 30,581 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 31,314, 31,594 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 216 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 171 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌చేశాయి. కాగా..  శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 479 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 180 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. 



Most Popular