మళ్లీ తగ్గిన రెపో రేటు- వడ్డీ మరింత చౌక

మళ్లీ తగ్గిన రెపో రేటు- వడ్డీ మరింత చౌక

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన మూడు రోజుల పాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా రెపో రేటులో పావు శాతం కోతను ప్రకటించింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.75 శాతానికి దిగివచ్చింది. ఇప్పటివరకూ 6 శాతంగా రెపో రేటు అమలవుతోంది. ఇందుకు ఎంపీసీ 6 వోటింగ్‌తో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 2010 సెప్టెంబర్‌ తరువాత మళ్లీ రెపో రేటు 6 శాతం దిగువకు చేరడం గమనించదగ్గ అంశం! కాగా.. ఎంఎస్‌ఎఫ్‌తోపాటు.. బ్యాంక్‌ రేటును 6.25 శాతం నుంచి 6 శాతానికి ఎంపీసీ సవరించింది. అంతేకాకుండా బ్యాంకులు స్వల్పకాలిక నిధులను రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద డిపాజిట్‌ చేస్తే లభించే రివర్స్‌ రెపో రేటు సైతం 5.75 శాతం నుంచి 5.5 శాతానికి పరిమితంకానుంది.

కొత్త ఏడాదిలో.. 
కొత్త ఆర్థిక సంవత్సరం(2019-20)లో చేపట్టిన రెండో ద్వైమాసిక పాలసీ సమీక్ష ఇది కాగా.. దేశీ స్టాక్‌ మార్కెట్లు అమ్మకాలతో వెనకడుగు వేశాయి. అయితే అత్యధిక శాతం మంది విశ్లేషకులు పావు శాతం రెపో రేటులో కోతను అంచనా వేసిన విషయం విదితమే. కాగా.. ఇంతక్రితం ఈ ఏడాది ఏప్రిల్‌ 4న చేపట్టిన పాలసీ సమీక్షలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటును పావు శాతం తగ్గించిన విషయం విదితమే. దీంతో రెపో రేటు 6 శాతంగా అమలవుతోంది. 

జీడీపీ 7 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) దేశ ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి సాధించవచ్చని ఆర్‌బీఐ తాజాగా అంచనా వేసింది. గతంలో వేసిన 7.2 శాతం వృద్ధి అంచనాలను స్వల్పంగా తగ్గించింది. ఈ  బాటలో తొలి అర్ధభాగానికి(ఏప్రిల్‌-సెప్టెంబర్‌) 6.8-7.1 శాతం స్థాయిలో వేసిన జీడీపీ వృద్ధి అంచనాలను 6.4-6.7 శాతానికి సవరించింది. ద్వితీయార్థంలో(అక్టోబర్‌-మార్చి) దేశ ఆర్థిక వ్యవస్థ 7.2-7.5 శాతం పురోగతిని సాధించగలదని తాజాగా అంచనా వేసింది. ఇదే విధంగా ద్రవ్యోల్బణ అంచనాలను తొలి అర్ధభాగానికి స్వల్పంగా 3.1 శాతానికి పెంచగా.. ద్వితీయార్థంలో 3.4-3.7 శాతానికి నామమాత్రంగా తగ్గించింది.



Most Popular