జూన్‌లో బుల్స్‌ హవా!.. ఈసారెలా?!

జూన్‌లో బుల్స్‌ హవా!.. ఈసారెలా?!

దేశీ స్టాక్‌ మార్కెట్లలో జూన్‌ నెల వచ్చేసరికి ఎక్కువసార్లు బుల్‌ ట్రెండ్‌ నడుస్తున్నట్లు గత చరిత్ర చెబుతోంది. ఈసారి పరిస్థితి ఎలా ఉండవచ్చన్న అంశంపై విశ్లేషకులు విభిన్నంగా స్పందించడం విశేషం! వివరాలు చూద్దాం.. 2019లో ఇప్పటివరకూ మార్కెట్లు 10 శాతం ర్యాలీ చేశాయి. లోక్‌సభ ఎన్నికల తదుపరి మే నెలలోనే మార్కెట్లు అత్యధికంగా లాభపడ్డాయి. ఇందుకు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లభించడం కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో జూన్‌ నెల ప్రారంభం రోజునే అటు సెన్సెక్స్‌, ఇటు నిఫ్టీ సరికొత్త గరిష్టాల రికార్డులను నెలకొల్పాయి. మార్కెట్‌ చరిత్రలో సెన్సెక్స్‌ తొలిసారి 40,000 పాయింట్ల మైలురాయికి ఎగువన నిలవగా.. నిఫ్టీ సైతం 12,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించి స్థిరపడింది. 

డేటా ఇలా
ఏస్‌ఈక్విటీ డేటా ప్రకారం గత 11ఏళ్లలో మార్కెట్లను ఆరుసార్లు బుల్స్‌ నియంత్రిచడం గమనార్హం! వీటిలో ప్రధానంగా 2011 జూన్‌లో సెన్సెక్స్‌ 9 శాతం ర్యాలీ చేయగా.. 2009లో 6 శాతం, 2013లో దాదాపు 3 శాతం చొప్పున ఎగసింది. అయితే మరోవైపు బేర్ ట్రెండ్‌ సైతం ఐదుసార్లు పైచేయి సాధించింది. వీటిలో ప్రధానంగా 2008 జూన్‌లో సెన్సెక్స్ 2 శాతం క్షీణించగా.. 2012లో 1.1 శాతం, 2016, 2017లలో 0.7 శాతం చొప్పున బలహీనపడింది.

ప్రస్తుత ర్యాలీ..
బీజేపీ ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు తెరతీయవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో మార్కెట్లు ఇటీవల జోరందుకున్నాయి. విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు పతనంకావడం, దేశీయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ మరోసారి వడ్డీ రేట్లను తగ్గించనున్న అంచనాలు.. సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణ వర్షపాత ఆశలు సైతం మార్కెట్లకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు.

కరెక్షన్‌కు చాన్స్‌
2019లో ఇప్పటికే మార్కెట్లు 10 శాతం ర్యాలీ చేయడంతో ఇకపై కరెక్షన్‌కూ అవకాశమున్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాల గమనం, చైనా అమెరికా మధ్య నడుస్తున్న వాణిజ్య వివాదాలు వంటి అంశాలు ప్రతికూలంగా పరిణమిస్తే సెంటిమెంటు బలహీనపడవచ్చని తెలియజేశారు. అయితే ఆర్‌బీఐ, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు చేపడితే మార్కెట్లకు సానుకూలమేనని అభిప్రాయపడ్డారు. డెరివేటివ్‌ డేటా ప్రకారం ఈ నెలలో నిఫ్టీ 11,800-12,200 మధ్య కన్సాలిడేట్ కావచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. మార్కెట్లు గరిష్టస్థాయిలో ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు. 

పెట్టుబడుల తీరిదీ
దేశీ స్టాక్స్‌లో పెట్టుబడుల విషయానికివస్తే.. ఏస్‌ఈక్విటీ డేటా ప్రకారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) గత 10ఏళ్లలో 7సార్లు నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. మిగిలిన మూడు సందర్భాలలో అంటే 2013 జూన్‌లో రూ. 9,000 కోట్లు, 2015లో రూ. 5,000 కోట్లు, 2018లో రూ. 2,000 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక దేశీ ఫండ్స్‌(డీఐఐలు) కూడా గత 10ఏళ్లలో 7సార్లు నికర పెట్టుబడిదారులుగానే నిలిచాయి. డీఐఐలు 2015 జూన్‌లో రూ. 10,000 కోట్లు, 2017లో రూ. 9200 కోట్లు, 2018లో రూ. 6,000 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి.

(Source: Moneycontrol)