ఆర్‌బీఐ పాలసీ- సంస్కరణలపై కన్ను!

ఆర్‌బీఐ పాలసీ- సంస్కరణలపై కన్ను!

రిజర్వ్‌ బ్యాంక్‌ చేపట్టనున్న పరపతి సమీక్షపై ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు దృష్టిపెట్టనున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ అధ్యక్షతన మంత్రి మండలి ఏర్పాటుకావడంతో ఇకపై ప్రభుత్వం తీసుకురానున్న సంస్కరణలు సైతం కీలకంగా నిలవనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. కాగా.. రిజర్వ్‌ బ్యాంక్‌ పరపతి విధానాలు సైతం స్వల్పకాలానికి కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో దేశ ఆర్థిక పురోగతి 5.8 శాతానికి పరిమితమైంది. ఇది గత ఐదేళ్లలోనే కనిష్టంకావడం గమనార్హం! దీంతో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) నిర్వహించనున్న పరపతి సమీక్షపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నారు. క్యూ4లో జీడీపీ మందగించడంతోపాటు.. మౌలిక సదుపాయాల రంగం ఏప్రిల్‌లో 4.7 శాతం వృద్ధి చూపింది. జీడీపీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గణాంకాలు శుక్రవారం(31న) విడుదలయ్యాయి.

పావు శాతం కోత?
మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆర్‌బీఐ పాలసీ సమావేశాలు మంగళవారం(3న) ప్రారంభమై గురువారం(6న) ముగియనున్నాయి. గురువారం మధ్యాహ్నం విధాన నిర్ణయాలు వెల్లడికానున్నాయి. గత పాలసీ సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటులో పావు శాతం కోతపెట్టింది. దీంతో ప్రస్తుతం రెపో రేటు 6 శాతంగా అమలవుతోంది. ఈ వారం చేపట్టనున్న సమీక్షలో మరో 0.25 శాతం రెపో కోతను పలువురు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది(2019) ఇప్పటివరకూ 0.5 శాతంమేర రెపో రేటును కుదించడం విశేషం! 

ఆటో రంగం ఎటు?
మే నెలలో వాహన విక్రయ గణాంకాలు శనివారం(1) నుంచి వెలువడనున్నాయి. దీంతో సోమవారం ఆటో రంగ కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాలు, ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి పలు ఇతర అంశాలు సైతం మార్కెట్లలో సెంటిమెంటును ప్రభావితం చేయగలవని విశ్లేషకులు పేర్కొంటున్నారు.