కొనుగోళ్ల పుష్‌- డ'బుల్‌తో క్లోజ్‌

కొనుగోళ్ల పుష్‌- డ'బుల్‌తో క్లోజ్‌

కేంద్రంలో సుస్ధిర ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో ఇన్వెస్టర్లకు జోష్‌ వచ్చింది. మోడీ అధ్యక్షతన ఎన్‌డీఏ ప్రభుత్వం సంస్కరణలకు తెరతీస్తుందన్న అంచనాలు సెంటిమెంటుకు బూస్ట్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తడబడుతూ ప్రారంభమైన మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ చేసింది. గరిష్టంగా 39,822ను తాకింది. చివరికి 249 పాయింట్లు ఎగసి 39,683 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 11,957 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. చివరికి 81 పాయింట్లు బలపడి 11,925 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా రెండో రోజు మార్కెట్లు లాభాలతో నిలిచాయి.

మీడియా, ఫార్మా వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్‌, మెటల్‌  2 శాతం చొప్పున పుంజుకోగా.. ఫార్మా, మీడియా 1 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. రియల్టీ స్టాక్స్‌లో ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, మహీంద్రా లైఫ్‌, ఒబెరాయ్‌, శోభా, డీఎల్‌ఎఫ్‌ 6-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇక నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్‌, యస్ బ్యాంక్‌, ఐవోసీ, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, గ్రాసిమ్‌, యాక్సిస్‌, హిందాల్కో, ఎంఅండ్‌ఎం, గెయిల్‌ 6-2 శాతం మధ్య ఎగశాయి. అయితే జీ, ఇండస్‌ఇండ్‌, ఆర్‌ఐఎల్‌, ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, మారుతీ, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌ 4.5-0.7 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు అప్‌
మార్కెట్లు జోరందుకోవడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1-2 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1790 లాభపడితే.. 792 మాత్రమే నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్‌
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2026 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 195 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1352 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 593 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.