సెన్సెక్స్ ట్రిపుల్‌- రియల్టీ జోరు

సెన్సెక్స్ ట్రిపుల్‌- రియల్టీ జోరు

కేంద్రంలో మరోసారి సుస్ధిర ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో సెంటిమెంటు బలపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ చేసింది. గరిష్టంగా 39,740ను తాకింది. ప్రస్తుతం 297 పాయింట్లు ఎగసి 39,732 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 95 పాయింట్లు బలపడి 11,939 వద్ద కదులుతోంది. తొలుత ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమయ్యాయి. తదుపరి జోరందుకున్నాయి. నేడు అమెరికా మార్కెట్లకు సెలవుకాగా.. ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది.

ప్రభుత్వ బ్యాంక్స్‌ ప్లస్‌
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్‌ 2 శాతం చొప్పున పుంజుకోగా మెటల్‌ 1.7 శాతం ఎగసింది. రియల్టీ స్టాక్స్‌లో  ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, శోభా, మహీంద్రా లైఫ్‌, ఒబెరాయ్‌, డీఎల్‌ఎఫ్‌, ఫీనిక్స్‌5.6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇక నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్‌, గ్రాసిమ్‌, ఎన్‌టీపీసీ, యస్ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, హిందాల్కో, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సిప్లా, ఎంఅండ్‌ఎం 5-2 శాతం మధ్య ఎగశాయి. అయితే జీ, ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ, ఆర్‌ఐఎల్‌, విప్రో 2-0.6 శాతం మధ్య క్షీణించాయి.

పేజ్‌, దివీస్‌ డీలా
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐజీఎల్‌, ఇంజినీర్స్‌, ఐసీఐసీఐ ప్రు, బీఈఎంఎల్‌, జస్ట్‌డయల్‌, ఎన్‌ఎండీసీ, బిర్లా సాఫ్ట్‌ 7-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క పేజ్‌ ఇండస్ట్రీస్‌ 11 శాతం కుప్పకూలగా, దివీస్‌ లేబ్‌ 8 శాతం పతనమైంది. ఈ బాటలో  పీసీ జ్యవెలర్స్, అశోక్‌ లేలాండ్‌, మెక్‌డోవెల్‌, లుపిన్‌, సీజీ పవర్‌, యూబీఎల్‌, ఇండియా సిమెంట్స్‌ 4.5-1.4 శాతం మధ్య క్షీణించాయి. 

చిన్న షేర్లు అప్‌
మార్కెట్లు జోరందుకోవడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1-1.6 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1650 లాభపడితే.. 634 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో క్యామ్లిన్‌ ఫైన్, ట్రిల్‌, నెక్‌లైఫ్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్లను తాకగా.. జెనిసిస్‌, వీఎస్‌టీ, ఇసాబ్‌, వీ2, విశాక, అవధ్‌, యాంబర్‌, నిట్కో, కాస్మో ఫిల్మ్స్‌, కాబ్రా, ఈఐడీ ప్యారీ, ఎన్‌ఎసీఎల్‌, డీఐఎల్‌ తదితరాలు 13-9 శాతం మధ్య జంప్‌చేశాయి.