ట్రంప్ టెంపరితనం.! H-1B వీసాదారుల జీవిత భాగస్వాములకు చెక్‌ !!

ట్రంప్ టెంపరితనం.! H-1B వీసాదారుల జీవిత భాగస్వాములకు చెక్‌ !!

"స్థానిక అమెరికన్లకే ఉద్యోగాలు"...  ఈ నినాదంతోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గద్దెనెక్కారు. విసా విధానాలు, వలస జీవుల పట్ల తొలి నాటి నుండి డోనాల్డ్ ట్రంప్ టెంపరితనాన్నే చూపిస్తూ వచ్చారు. ఇప్పటికే ఇప్పటికే హెచ్‌-1బీ వీసాల జారీలో నిబంధనలు కఠినతరం చేశారు. తాజాగా హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతిపై నిషేధం విధించే ప్రక్రియ ప్రారంభించినట్టు ట్రంప్ కార్యాలయం పేర్కొనడం కలకలం రేపుతోంది.  అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతిని తొలగించేలా ట్రంప్‌ సర్కార్‌ గతంలో ప్రతిపాదనలు తయారుచేసింది. తాజాగా ఈ ప్రతిపాదనలపై ఇటీవల నోటీసులు జారీ చేశారు.  ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైనట్లు అమెరికా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.   ప్రస్తుతం ఈ ప్రక్రియ రెండో దశకు చేరుకుందనీ, ఇక్కడ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే.. వాటిని ఫెడరల్‌ రిజిస్ట్రీలో ప్రచురించి ఆ తర్వాత కొత్త ప్రతిపాదనలపై 60 రోజుల వరకు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటారు.  అనంతరం దీనిపై చట్టం తీసుకొస్తారు. అయితే ఇదంతా జరిగేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అంటున్నా... ముఖ్యంగా భారతీయ ఎన్నారైలు మాత్రం ఈ విషయంలో ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. 

Image result for trump angry

తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే భారతీయులే ఎక్కువగా నష్టపోతారు. హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వారి జీవిత భాగస్వాములు అమెరికాలోని కంపెనీల్లో పనిచేసేందుకు హెచ్‌-4 డిపెండెంట్‌ వీసాల కింద వీలు కల్పిస్తూ 2015లో ఒబామా ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ విధానాన్ని తొలగిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో ప్రకటించారు. దీన్ని భారత సంతతికి చెందిన ప్రజాప్రతినిధులు, పలు సంఘాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అమెరికా యువతకు ఉద్యోగాలు కల్పించేందుకే ఈ నిబంధనలు తీసుకొస్తున్నట్లు ట్రంప్‌ సర్కార్‌ చెబుతోంది. ఒక వైపు అమెరికా చైనా వాణిజ్య యుద్ధానికి తెరతీసిన ట్రంప్ ఇమేజ్‌ క్రమంగా మసకబారుతుండగా, ఇప్పుడు హెచ్ 1 బీ వీసా దారుల జీవిత భాగస్వాముల ఉద్యోగ అవకాశాలను కూడా గండి కొట్టడంతో ట్రంప్ ఇమేజ్ మరింతగా దిగజారనుందని ప్రవాస భారతీయులు అంటున్నారు.