క్యూ4.. ఐజీఎల్‌- అవంతీ జోష్‌

క్యూ4.. ఐజీఎల్‌- అవంతీ  జోష్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో సీఎన్‌జీ, పీఎన్‌జీ పంపిణీ సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌(ఐజీఎల్‌) కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. కాగా..  మరోపక్క గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో సాధించిన ఫలితాలు అంచనాలను చేరడంతో రొయ్యల పెంపకం, ఎగుమతుల సంస్థ అవంతీ ఫీడ్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం.. 

ఐజీఎల్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఇంద్రప్రస్థ గ్యాస్‌ నికర లాభం 29 శాతం ఎగసి రూ. 225 కోట్లను అధిగమించింది. ఇబిటా సైతం 14 శాతం పుంజుకుని రూ. 331 కోట్లను తాకింది. ఇక మొత్తం ఆదాయం 27 శాతం వృద్ధితో రూ. 1543 కోట్లకు చేరింది. మార్జిన్లు మాత్రం 24 శాతం నుంచి 21.5 శాతానికి మందగించాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఐజీఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 7 శాతం జంప్‌చేసింది. రూ. 336 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 338ను అధిగమించడం ద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది.

Related image

అవంతీ ఫీడ్స్‌ 
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో అవంతీ ఫీడ్స్‌ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 68 కోట్లకు పరిమితమైంది. ఇబిటా సైతం 20 శాతం నీరసించి రూ. 93 కోట్లను తాకింది. అయితే మొత్తం ఆదాయం 3 శాతం పెరిగి రూ. 858 కోట్లకు చేరింది. మార్జిన్లు 14 శాతం నుంచి 10.9 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం అవంతీ ఫీడ్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 6 శాతం జంప్‌చేసింది. రూ. 361 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 366 వరకూ ఎగసింది. కాగా.. బేస్‌ క్వార్టర్‌లో రూ. 35.4 కోట్లమేర నిల్వల(ఇన్వెంటరీ) లాభం నమోదుకావడం గమనార్హం!