నారాయణకు కిక్‌- దివీస్‌కు షాక్‌

నారాయణకు కిక్‌- దివీస్‌కు షాక్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్‌ సర్వీసుల సంస్థ నారాయణ హృదయాలయ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఏకంగా 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. కాగా..  మరోపక్క గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో సాధించిన ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో ఫార్మా రంగ హైదరాబాద్‌ సంస్థ దివీస్‌ లేబొరేటరీస్‌ కౌంటర్‌ డీలాపడింది.  ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో భారీ నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం.. 

నారాయణ హృదయాలయ
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో నారాయణ హృదయాలయ నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 37 కోట్లకు తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 10 కోట్ల నికర లాభం మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 18 శాతం పెరిగి రూ. 765 కోట్లను అధిగమించింది. ఇబిటా 71 శాతం జంప్‌చేసి రూ. 89 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో నారాయణ హృదయాలయ షేరు 20 శాతం దూసుకెళ్లింది. అంతా కొనుగోలుదారులే తప్ప అమ్మేవాళ్లు కరవుకావడంతో రూ. 239 వద్ద ఫ్రీజయ్యింది. 

Related image

దివీస్‌ లేబొరేటరీస్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో దివీస్‌ లేబొరేటరీస్‌ నికర లాభం దాదాపు 11 శాతం పెరిగి రూ. 289 కోట్లకు తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 262 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 15 శాతం పెరిగి రూ. 1256 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దివీస్‌ లేబొరేటరీస్‌ షేరు 7.5 శాతం పతనమైంది. రూ. 1635 వద్ద ట్రేడవుతోంది.