కుప్పకూలిన మన్‌పసంద్‌- పేజ్ ఇండస్ట్రీస్

కుప్పకూలిన మన్‌పసంద్‌- పేజ్ ఇండస్ట్రీస్

కంపెనీ టాప్‌ఎగ్జిక్యూటివ్‌లను సెంట్రల్‌ జీఎస్‌టీ, కస్టమ్‌ కార్యాలయ అధికారులు అరెస్ట్‌ చేసినట్లు వార్తలు వెలువడటంతో పానీయాల సంస్థ మన్‌పసంద్‌ బెవరేజెస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో జాకీ బ్రాండ్‌ ఇన్నర్‌వేర్‌ దిగ్గజం పేజ్‌ ఇండస్ట్రీస్ కౌంటర్‌ సైతం డీలాపడింది. ఈ రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో భారీ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..
 
మన్‌పసంద్‌ బెవరేజెస్‌
మన్‌పసంద్‌ బెవరేజెస్‌ కంపెనీ ఎండీ అభిషేక్‌ సింగ్‌, ఆయన సోదరుడు హర్షవర్ధన్‌ సింగ్‌తోపాటు.. సీఎఫ్‌వో పరేష్‌ థక్కర్‌లను సెంట్రల్‌ జీఎస్‌టీ, కస్టమ్స్‌ కార్యాలయ అధికారులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఒక కేసు దర్యాప్తులో భాగంగా వీరిని అరెస్ట్‌ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ కౌంటర్లో అంతా అమ్మేవాళ్లు తప్ప కొనుగోలుదారులు కరవయ్యారు. ఫలితంగా ఎన్‌ఎస్ఈలో మన్‌పసంద్‌ షేరు ప్రస్తుతం 20 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 22 నష్టంతో రూ. 88 వద్ద ఫ్రీజయ్యింది. ట్రేడింగ్‌ పరిమాణం సైతం గత 20 రోజుల సగటుతో పోలిస్తే 12 రెట్లు ఎగసింది. కాగా.. గత ఏడాది కాలంలో ఈ షేరు 74 శాతం పతనంకావడం గమనార్హం!

Related image

పేజ్‌ ఇండస్ట్రీస్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో పేజ్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 75 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 94 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 608 కోట్లను తాకింది. ఇబిటా 19 శాతం వెనకడుగుతో రూ. 120 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పేజ్‌ ఇండస్ట్రీస్‌ షేరు 9.5 శాతం కుప్పకూలి రూ. 19,850 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 19,760 వరకూ నీరసించింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం!