వాల్‌స్ట్రీట్‌ ఫ్లాట్- నేడు సెలవు

వాల్‌స్ట్రీట్‌ ఫ్లాట్- నేడు సెలవు

చైనాతో వాణిజ్య వివాద పరిష్కార అవకాశాలు మెరుగుపడుతున్నట్లు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజాగా వ్యాఖ్యానించడంతో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు కోలుకున్నాయి. రెండు రోజుల నష్టాల నుంచి బయటపటి స్వల్పంగా లాభపడ్డాయి. శుక్రవారం డోజోన్స్‌ 95 పాయింట్లు(0.4 శాతం) బలపడి 25,586కు చేరగా.. ఎస్‌అండ్‌పీ స్వల్పంగా 4 పాయింట్లు(0.15 శాతం) పుంజుకుని 2,826 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ సైతం నామమాత్రంగా 9 పాయింట్లు(0.1 శాతం) పెరిగి 7,637 వద్ద స్థిరపడింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయవచ్చన్న అంచనాలతో గత వారం మధ్యలో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. మెమోరియల్‌ డే సందర్భంగా సోమవారం మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్‌ పరిమాణం తక్కువగా నమోదైంది.

ప్రమాదకర సంస్థ
ఓవైపు చైనాతో వాణిజ్య వివాదాలు పరిష్కరించుకోనున్నట్లు చెబుతూనే ట్రంప్‌.. మరోపక్క టెలికం దిగ్గజం హువేను ప్రమాదకర సంస్థగా పేర్కొనడం గమనార్హం! దీంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు కొనసాగుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రెండు వారాల క్రితం చివరిసారిగా అమెరికా, చైనా అత్యున్నత అధికారుల మధ్చ చర్చలు విఫలమైన విషయం విదితమే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలకు ఎలాంటి ప్రణాళికలు లేకపోగా.. ట్రంప్‌ తాజాగా ఆశలు కల్పించినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా.. గత వారం డోజోన్స్‌ 0.7 శాతం, ఎస్‌అండ్‌పీ 1.2 శాతం చొప్పున వెనకడుగు వేయగా.. నాస్‌డాక్‌ 2.3 శాతం తిరోగమించింది.

ఫుట్‌లాకర్‌ స్కిడ్‌
త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో ఫుట్‌వేర్‌ రిటైలింగ్ సంస్థ ఫుట్‌లాకర్‌ ఇంక్‌ షేరు 16 శాతం కుప్పకూలింది. ఈ బాటలో ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో ఆటోడెస్క్‌ ఇంక్‌ షేరు 5 శాతం పతనమైంది. అయితే గ్లోబల్‌ పేమెంట్స్‌ ఇంక్‌ను కొనుగోలు చేసేందుకు డీల్‌ కుదుర్చుకోనున్న వార్తలతో టోటల్‌ సిస్టమ్‌ సర్వీసెస్‌ ఇంక్‌ 14 శాతం దూసుకెళ్లింది. గ్లోబల్‌ పేమెంట్స్‌ సైతం 4 శాతం ఎగసింది.
 
యూరప్‌ అప్
బ్రెక్సిట్‌ డీల్‌ అంశంలో విఫలంకావడంతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు బ్రిటిష్‌ ప్రధాని థెరెసా మే వారాంతాన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనూ శుక్రవారం యూరోపియన్‌ మార్కెట్లు లాభపడ్డాయి. యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ 0.5-0.7 శాతం మధ్య బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. ఇండొనేసియా 0.6 శాతం, జపాన్ 0.3 శాతం చొప్పున పుంజుకోగా.. హాంకాంగ్‌, చైనా, సింగపూర్‌, కొరియా, తైవాన్‌ 0.8-0.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. థాయ్‌లాండ్‌ మార్కెట్ ఓపెన్‌కాలేదు. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 97.56కు బలహీనపడింది. యూరోపియన్‌ పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో యూరో 1.121 వద్ద సానుకూలంగా ట్రేడవుతోంది.