నేడు ప్రతికూల ఓపెనింగ్‌?!

నేడు ప్రతికూల ఓపెనింగ్‌?!

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో కొలువుదీరనుండటంతో ఇటీవల జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 31 పాయింట్లు క్షీణించి 11,847 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానుండటంతో గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో మార్కెట్లు భారీలాభాలతో ర్యాలీ చేశాయి. దీంతో ట్రేడర్లు అప్పుడప్పుడూ లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ బాటలో నేడు మరోసారి మార్కెట్లు ఆటుపోట్లకు లోనుకావచ్చని అభిప్రాయపడ్డారు. కాగా.. శుక్రవారం రెండు రోజుల నష్టాల నుంచి బయటపడిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి.
 
సంస్కరణల ఆశలు..
నరేంద్ర మోడీ అధ్యక్షతన బీజేపీ తిరిగి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటంతో కీలక సంస్కరణలకు తెరలేవనున్న అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. దీంతో వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి భారీ ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ 623 పాయింట్లు దూసుకెళ్లి 39,435 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ 187 పాయింట్లు జంప్‌చేసి 11,844 వద్ద స్థిరపడింది.   

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,715 పాయింట్ల వద్ద, తదుపరి 11,586 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,916 పాయింట్ల వద్ద, తదుపరి 11,988 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 30,759, 30,306 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 31,470, 31,728 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్‌
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2026 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 195 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1352 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 593 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.